బాబుకు మోడీ యువ సెగ: ఇరువైపుల కిటికీ తెరిచారా?

ఇప్పటి వరకు బిజెపికి రాష్ట్రంలో పట్టులేదు. మోడీ రాక అనంతరం క్రమంగా బిజెపి పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొత్తుల కోసం ఆలోచించకుండా పట్టు పెంచుకోవాలని, అవసరమైతే తాను మూడు నాలుగుసార్లు వస్తానని మోడీ రాష్ట్ర నేతలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో మోడీ ప్రధాని అభ్యర్థి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అవినీతి ఆయుధంగా బాబు యువతపై చాలా ఆశలు పెట్టుకున్నారు.
అదే సమయంలో మోడీ పట్ల యువతలో క్రేజ్ ఉంది. ఎన్నికల నాటికి రాష్ట్రంలో లేదా తెలంగాణలో బిజెపి బలపడితే ఆ ఓట్లలో ఎంతో కొంత ఆ పార్టీ వైపు వెళ్లే అవకాశాలున్నాయంటున్నారు. ఇది బాబును ఇక్కట్లకు గురి చేసే అంశమే అంటున్నారు. మరోవైపు బిజెపితో పొత్తు విషయమై పార్టీలో చర్చ జరుగుతున్నట్లుగా కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. పొత్తు విషయమై బాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లుగా కనిపిస్తోంది.
ఎన్డీయేలోకి మోడీ ఆహ్వానించడంపై బాబు అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ స్పందించడం లేదు. తద్వారా బాబు కూడా భవిష్యత్తు రాజకీయాలకనుగుణంగా కిటికీలు తెరిచి పెట్టారంటున్నారు. బాబుకు గతంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకొని బిజెపి ఆయనకు ఆహ్వానం పలికింది. బాబు కూడా మోడీ ఆఫర్‌పై ఆచితూచి స్పందించారు. ఆ విషయంపై మాట్లాడేందుకు నిరాకరించారు.
రాష్ట్రం ఇన్ని సమస్యల మధ్య చిక్కుకొని ఉన్నప్పుడు తాను రాజకీయాలు మాట్లాడబోనని, వాటికి ఇది సమయం కాదని చెప్పారు. తాము కాంగ్రెస్‌కు వ్యతిరేకమని, అది స్పష్టమన్నారు. అందులో మొదటి నుంచీ రాజీలేదని, ఇప్పుడూ రాజీ లేదన్నారు. ఈ దేశంలో ఇప్పటికి నాలుగుసార్లు కాంగ్రెస్ వ్యతిరేక ప్రభుత్వాలు ఏర్పడ్డాయని, అందులో మూడు ప్రభుత్వాల ఏర్పాటులో తమ పాత్ర ఉందన్నారు.
తమ పార్టీ పుట్టక ముందు జయ ప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలో జనతా ప్రభుత్వం ఏర్పడిందని, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తమ పాత్ర కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. ఐదో ప్రభుత్వం ఏర్పడటానికి కూడా మీ కృషి ఉంటుందా అన్న ప్రశ్నకు తగిన సమయంలో వాటిపై మాట్లాడతానని ఆయన బదులిచ్చారు.












Click it and Unblock the Notifications