మొయిలీతో విజయశాంతి: కాంగ్రెసులోకి తెరాస నేతలు
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నుంచి సస్పెన్షన్‌కు గురైన మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి మంగళవారం కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీని కలిశారు. విభజనపై అభిప్రాయాలను వినడానికి ఏర్పాటైన ఎకె ఆంటోనీ కమిటీలో వీరప్ప మొయిలీ సభ్యుడిగా ఉన్నారు. గత కొద్ది రోజులుగా విజయశాంతి కాంగ్రెసు అధిష్టానం పెద్దలను కలుస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారు. విజయశాంతి మంగళవారం ఢిల్లీలో హడావిడి చేశారు. ఎకె ఆంటోనీ కమిటీని కలిసి నివేదికను సమర్పించారు.
కాంగ్రెసు పార్టీలో చేరడానికి ఆమె రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఆమె సోమవారం కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. ఆమెతో పాటు అంతకు ముందే తెరాస నుంచి సస్పెన్షన్‌కు గురైన రఘునందనరావు కూడా దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. ఆయన కాంగ్రెసులో చేరారు.

కాగా, తెరాసకు సలాం కొట్టి, కాంగ్రెసులో చేరడానికి సిద్దమైన సీనియర్ నాయకులు విజయరామారావు, చంద్రశేఖర్ మంగళవారం దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. తాము కాంగ్రెసులో చేరుతామని వీరిద్దరు గతంలోనే ప్రకటించారు. చెప్పినట్లుగా వీరిద్దరు నాయకులతో పాటు రఘునందన్ రావు మంగళవారం దిగ్విజయ్ సింగ్ సమక్షంలో కాంగ్రెసు పార్టీలో చేరారు.
ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి మధ్యవర్తిత్వంతో విజయశాంతి కాంగ్రెసు పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. రేణుకా చౌదరి చొరవతోనే గతంలో విజయశాంతి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారని అంటున్నారు. మెదక్ లోకసభ స్థానం నుంచి పోటీ చేసే విషయంపై కూడా విజయశాంతి కాంగ్రెసు పెద్దలతో మాట్లాడుతున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications