ఢిల్లీలో భేటీలు: రిజైన్ చేయండి.. ఎపిఎన్జీవోలపై కోర్టు ఫైర్
న్యూఢిల్లీ/హైదరాబాద్: విభజన నేపథ్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీలో భేటీల మీద భేటీలు జరుగుతున్నాయి. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరడంతో పాటు ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను ఆయన అధినేత్రికి వివరించారు. గంటపాటు జరిగిన ఈ భేటీలో ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, అహ్మద్ పటేల్‌లు పాల్గొన్నారు.
ఆంటోనితో రాములమ్మ
కేంద్రమంత్రి ఎకె ఆంటోనితో మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి భేటీ అయ్యారు. ఆమె ఇటీవల కాంగ్రెసు ముఖ్యనేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌తో రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు భేటీ అయ్యారు.

ఎపిఎన్జీవోలపై హైకోర్టు ఆగ్రహం
ఎపిఎన్జీవోల పైన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు గురువారం మండిపడింది. విభజనను వ్యతిరేకిస్తూ ఎపిఎన్జీవోలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగాలకు రాజీనామా చేసి సమ్మె చేయాలను సూచించింది. కేంద్రం తీసుకున్న రాజకీయ నిర్ణయాన్ని మీరెలా సవాల్ చేస్తారని ప్రశ్నించింది. సమ్మె రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.
మీరు ప్రభుత్వ ఉద్యోగులా? లేక ప్రయివేటు ఉద్యోగులా? అని ప్రశ్నించింది. సమ్మె చేయాలనుకుంటే ముందు రాజీనామా చేయాలని పేర్కొంది. అదే సమయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎస్మా ప్రయోగించామని ప్రభుత్వం తరఫు లాయర్ వివరణ ఇచ్చారు. సోమవారం లోగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఎపిఎన్జీవోలు కౌంటర్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు.












Click it and Unblock the Notifications