టీపై టిడిపి, వైకాపా యూటర్న్ వల్లే జాప్యం: డికె అరుణ
మహబూబ్‌నగర్: 2014లోగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని, నవ తెలంగాణలోనే ఎన్నికలు జరుగుతాయని సమాచార, ప్రసార శాఖ మంత్రి డికె అరుణ అన్నాపు. కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున, సుహృద్భావ వాతావరణంలో రాష్ట్ర విభజనకు సహకరించాలని ఆమె సీమాంధ్ర ప్రజాప్రతినిధులను కోరారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ఇదే కోరామని చెప్పారు. అఖిలపక్ష సమావేశంలో చెప్పినదానికి భిన్నంగా తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు యూటర్న్ తీసుకోవడం వల్లే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో జాప్యం జరుగుతోందని డికె అరుణ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ప్రధాని మన్మోహన్, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌కు, యూపీఏ భాగస్వామ్యపక్షాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సహకారంతో కాంగ్రెస్ నేతలు ఈ సభ నిర్వహించారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణపై ప్రకటన చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభ తీర్మానాన్ని ఆమోదించింది.

రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో త్వరగా బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ మరో తీర్మానాన్ని కూడా ఆమోదించింది. ఈ తీర్మానాలను పార్టీ అధిష్ఠానానికి అందించేందుకు త్వరలో ఢిల్లీ వెళ్లనున్నట్లు మంత్రి అరుణ తెలిపారు. తాము విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. కేవలం అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపేందుకే సభ ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.
తెలంగాణ రావడం ఇష్టం లేని వారే తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని విమర్శించారు. తన పర్యటనను ఎన్ని సార్లు అడ్డుకున్నా, ఎవరిపైనా కేసులు పెట్టలేదని తెలిపారు. విడిపోయి కలిసుండేందుకు సహకరించాలని కోరినా, కొందరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అయినా తెలంగాణ రాదనే భయమక్కర్లేదని, సిడబ్ల్యుసి తీర్మానం చేసిన దృష్ట్యా తెలంగాణ ఏర్పాటు ఖాయమని అన్నారు.












Click it and Unblock the Notifications