సీమాంధ్రులకు కిరణ్ భరోసా: తెలంగాణ నేతల హెచ్చరిక

విభజనపై శాసన సభలో తీర్మానం వీగిపోయేవరకూ సీమాంధ్రలో ఉద్యమం ఆగే పరిస్థితి లేదని, పార్టీ పరిస్థి తికూడా నానాటికీ తీసికట్టుగా మారుతోందని ఆ ప్రాంత కాంగ్రెస్ నేతలు సిఎం దృష్టికి తీసుకెళ్లారు. సిడబ్ల్యూసి నిర్ణయం తర్వాత సీమాంధ్రలో కాంగ్రెస్‌నే మొదటి ముద్దాయిగా పరిగణిస్తున్నారని వివరించారు. విభజనపై అధిష్ఠానం వెనక్కు తగ్గకపోతే అక్కడ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
నేతలకు అవమానం తప్పడంలేదని సిఎంకు చెప్పారు. 2009లో రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేయగానే సమైక్యవాదం అందుకున్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఆనాటి నుంచి దానికి కట్టుబడే ఉన్నారని గుర్తు చేశారు. ఇక మంత్రి సాకే శైలజానాథ్ సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల జెఏసి కన్వీనర్‌గా పోరాడుతున్నారని, వారిద్దరినీ కూడా సమైక్యవాదులు అడ్డుకున్నారని, సమస్య తీవ్రతకు ఇదే నిదర్శనమని వివరించారు. ఇతర నేతలను కూడా అడ్డుకుంటున్నారని చెప్పారు.
మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వలసలు మళ్లీ మొదలయ్యాయని గుర్తు చేశారు. పార్టీని రక్షించుకునేందుకు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనని సిఎంపై వారు ఒత్తిడి పెంచుతున్నారట. అయితే, విభజనకు చాలా సమయం పడుతుందని, 2014 ఎన్నికల్లోగా సాధ్యం కాదని కిరణ్ వారికి నచ్చచెబుతున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీలో విభజన తీర్మానం చర్చకు వచ్చినప్పుడు కచ్చితంగా వీగిపోతుందని, ఆ తర్వాత కేంద్రం ముందుకు వెళ్లే పరిస్థితి ఎంతమాత్రం ఉండదని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మీదే బాధ్యత
మరోవైపు ఎపిఎన్జీవోల సభకు అనుమతిస్తే శాంతిభద్రతల బాధ్యత తీసుకోవాలని తెలంగాణ మంత్రులు పరోక్షంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని హెచ్చరించారు. తెలంగాణ ప్రాంతం వాళ్లు శాంతి ర్యాలీకి అనుమతి కోరుతున్నారని, దీనికీ అనుమతివ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఎవరెన్ని చెప్పినా తెలంగాణ ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని స్పష్టం చేశారు. మంత్రుల నివాస ప్రాంగణంలో తెలంగాణ ఐక్య కార్యాచరణ సంఘం నేతలతో తెలంగాణ మంత్రులు భేటీ అయ్యారు.
డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు జానా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, డికె అరుణ, బస్వరాజు సారయ్య, పిసిసి మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్‌లు భేటీ అయ్యారు. సమైక్య సభ వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేదని భావిస్తే అనుమతి ఇచ్చి ఆబాధ్యతను తీసుకోవాలని అన్నారు.












Click it and Unblock the Notifications