బాబు యాత్రను అడ్డుకున్న ఉద్యోగులు, టీచర్లు
గుంటూరు: రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర జరుపుతూ శుక్రవారం గుంటూరు జిల్లా మంగళగిరి చేరిన తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉద్యోగుల జెఎసి, ఉపాధ్యాయుల జెఎసి ఆధ్వర్యాన ఉద్యోగులు, ఉపాధ్యాయులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్లకార్డులు చేతబూని నిరసన తెలిపారు.
రాష్ట్ర విభజన వద్దని, సమైక్యంగానే ఉంచాలని, ప్రాణాలైనా అర్పిస్తాం రాష్ట్రాన్ని విభజించనీయబోమని ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అడ్డుపడి ప్లకార్డులతో నిరసన తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని పక్కకు పంపించారు. సమైక్యాంధ్రకు మద్దతు తెలిపాలని కోరుతూ చంద్రబాబు నాయుడు వాహనంపైకి ఎక్కి ఉద్యోగులు ఆయనకు వినతిపత్రం అందజేశారు.

అంతకు ముందు ఆత్మకూరు యాత్రలో భాగంగా చంద్రబాబు మంగళగిరిలోని ఆంజనేయమిద్దె సెంటర్లో జరిగిన సభలో ప్రసంగిస్తూ ఇటలీ సోనియాకు, ఇడుపులపాయ విజయలక్ష్మికి చీకటి ఒప్పందం కుదిరిందని విమర్శించారు సిడబ్ల్యుసి మాత్రం తెలుగుజాతిని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రపన్ని తీర్మానం చేసింద ఆరోపించారు.
తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తమ పార్టీలో విలీనమవుతుందని, అక్కడ 17 ఎంపి సీట్లు వస్తాయని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను అడ్డం పెట్టుకుంటే సీమాంధ్రలో సీట్లు వస్తాయని భావించి కాంగ్రెసు రాష్ట్ర విభజనకు కుట్రపన్నిందని విమర్శించారు.












Click it and Unblock the Notifications