స్వర్ణాన్ని ఇసుక చేశారు: టీపై మోడీ, చక్కబెడ్తాం: చిద్దూ
అంబికాపూర్/ న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెసు అనుసరించిన తీరుపై గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రచార రథసారథి నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అంశాన్ని కాంగ్రెసు పార్టీ గందరగోళం చేసిందని ఆయన అన్నారు. తెలంగాణ పేరుతో కాంగ్రెసు పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అగ్గి రాజేసిందని ఆయన విమర్శించారు. కాంగ్రెసు పార్టీ బంగారాన్ని కూడా ఇసుకగా మార్చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం చత్తీస్‌గడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను అత్యంత సామరస్యపూర్వక వాతావరణంలో ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు.
చత్తీస్‌గడ్ ఎన్నికల ప్రచార సభలో ఆయన శనివారం ప్రసంగించారు. కాంగ్రెసు ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన ధ్వజమెత్తారు. చత్తీస్‌గడ్‌లో ఓ సింగ్, ఢిల్లీలో ఓ సింగ్ ఉన్నారని, ఇద్దరు కూడా డాక్టర్లు అని, చత్తీస్‌గడ్‌లోని సింగ్ ప్రజల డాక్టర్ అని, ఢిల్లీలోని డాక్టర్ డబ్బుల డాక్టర్ అని ఆయన రమణ్ సింగ్, మన్మోహన్ సింగ్‌లకు పోలిక తెస్తూ వ్యాఖ్యానించారు.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులను తాము అర్థం చేసుకోగలమని కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితిని చక్కదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పారు. ఈ సమయంలో ప్రత్యేక రాష్ట్రవాదులు సంయమనంతో ఉండాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను ప్రభుత్వం వింటోందని చిదంబరం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు నెలకొనేందుకు సంయమనంతో ఉండాలని ఆయన కోరారు. కాగా, తెలంగాణ ప్రక్రియ ముందుకు సాగుతోందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించారు.












Click it and Unblock the Notifications