చంద్రబాబుకు సమైక్య సెగ: ప్రచార రథంలో పొగలు
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి కృష్ణా జిల్లా ఆత్మగౌరవ యాత్రలో ఆదివారంనాడు సమైక్య సెగ తగిలింది. విసన్నపేటలో ఆయనకు సమైక్య వాదులు అడ్డుతగిలారు. బహిరంగ సభ ముగించుకుని రెడ్డిగూడెం బయలుదేరుతుండగా మార్గమధ్యంలో పెద్ద ఎత్తున సమైక్యవాదులు, ఏపీఎన్జీవోలు చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డగించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చారు. దాన్ని పరిశీలించిన చంద్రబాబు తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో సమైక్యవాదులు అడ్డుతొలిగారు.
ఇదిలావుంటే, చంద్రబాబు ప్రచార రథంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పొగలు లేచి కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. ఆదివారం ఉదయం 10గంటల ప్రాంతంలో నూజివీడు ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద రథంలో మైక్‌లను సరిచేస్తుండగా షార్ట్ సర్క్యూట్ జరిగి పొగలు లేచాయి. వెంటనే టెక్నీషియన్లు దాన్ని సరిచేసి ప్రమాదమేమీ లేదని చెప్పారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కాగా, తన యాత్రలో చంద్రబాబు కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లపై తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలుగుజాతికి కాంగ్రెస్ పార్టీ అగ్గి పెట్టిందని, వైయస్సార్ కాంగ్రెసు ఒక పక్క, తెరాస మరోపక్క ఈ అగ్నికి ఆజ్యం పోస్తున్నాయని ఆయన విమర్సించారు. ఈ మూడు పార్టీలదీ ఒకే కులం, ఒకే మతమని, వాటి డీఎన్ఏ అవినీతేనని విమర్శించారు. నాడు కెసిఆర్‌కు తాను మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని చంద్రబాబు అన్నారు.
సిడబ్ల్యుసి తీర్మానం ప్రజల కోసం చేస్తే ఒప్పుకునేవాడిని, తెలుగుజాతి మధ్య చిచ్చుపెట్టాలని చూస్తే సహించేది లేదని ఆయన అన్నారు. 'వాల్మీకి రామాయణాన్ని రాశాడు. వ్యాసుడు మహాభారతాన్ని రాశాడు. తెలుగువాడు రాస్తాడు కాంగ్రెస్‌కు మరణ శాసనం. తెలుగుజాతితో పెట్టుకున్న వారి అంతు చూస్తాం' అని ఆయన వ్యాఖ్యానించారు. దేశానికి ప్రధాని కావాలని రాహుల్‌గాంధీ, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని వైఎస్ జగన్ కంటున్న కలలు అలానే మిగిలిపోతాయన్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్ మరో తుగ్లక్‌లా తయ్యారయ్యారని అన్నారు.
వైఎస్ రాజశేఖర రెడ్డిని చంపించింది సోనియానే అని రాష్ట్రంలో ఉప ఎన్నికలకు ముందు ఆరోపణలు చేసిన వైయస్సార్ కాంగ్రెసు ఆమెపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. ఇవన్నీ లాలూచీ రాజకీయాలు కావా? అని ప్రశ్నించారు. జగన్ బెయిల్ కోసం ప్రధానితో, సోనియాతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మంతనాలు జరుపుతోందని చంద్రబాబు విమర్శించారు. సిబిఐ ప్రధాని చేతుల్లో ఉందని, దాంతో ఏదోవిధంగా బెయిల్ పొందాలన్న లక్ష్యంతో విజయలక్ష్మి ఆయన చుట్టూ తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎంపీలు సోనియా పెంపుడు కుక్కలని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications