CJI NV Ramana: పుట్టపర్తిలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్
అనంతపురం: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. అనంతపురం జిల్లా పుట్టపర్తికి వచ్చారు. తన భార్యతో కలిసి పుట్టపర్తికి చేరుకున్నారు. శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం 40వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. స్నాతకోత్సవానికి ఆయనను ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు యూనివర్శిటీ అధికారులు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఆయన పతకాలను ప్రదానం చేస్తారు. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ఢిల్లీ నుంచి విమానంలో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో పుట్టపర్తికి చేరుకున్నారు. ఆయన వెంట కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతురాజ్ అవస్థి ఉన్నారు. పుట్టపర్తికి చేరుకున్న ఆయనను అనంతపురం జిల్లా సివిల్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమేష్, ధర్మవరం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివజ్యోతి, జిల్లా జాయింట్ కలెక్టర్లు నిశాంత్, సిరి, శిక్షణలో ఉన్న ఐఎఎస్ అధికారి సూర్య, సత్యసాయి విశ్వవిద్యాలయం వైఎస్ ఛాన్సలర్ సంజీవ్, ట్రస్టీ రత్నాకర్ ఇతర అధికారులు స్వాగతం పలికారు. రాత్రి ఆయన శ్రీనివాస అతిథి గృహంలో బస చేశారు.
తన పర్యటనలో భాగంగా సీజేఐ ఎన్వీ రమణ- తొలుత ఈ ఉదయం 9 గంటలకు సాయి కుల్వంత్ మందిరంలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటారు. నివాళి అర్పిస్తారు. అనంతరం స్నాతకోత్సవంలో పాల్గొంటారు. విద్యార్థులకు పతకాలను అందిస్తారు. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. 20 మంది విద్యార్థులు సీజేఐ ఎన్వీ రమణ చేతుల మీదుగా బంగారు పతకాలను అందుకోనున్నారు. మరో 24 మందికి ఆయన డాక్టరేట్ పట్టాలను ప్రదానం చేస్తారు.

ఈ స్నాతకోత్సవం సందర్భంగా మొత్తం 465 మందికి విద్యార్థులు పట్టాలను అందుకోనున్నారు. ఈ కార్యక్రమం ముగిసేంత వరకూ జస్టిస్ ఎన్వీ రమణ పుట్టపర్తిలో ఉంటారు. అనంతరం విద్యార్థుల వేద పఠనం, ప్రతిజ్ఞ, సత్యసాయి గీతాలాపనలో పాల్గొంటారు. ఈ సాయంత్రం 5 గంటలకు సత్యసాయి మహాసమాధి వద్ద నిర్వహించే సంగీత కచేరిలో పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గంలో బెంగళూరుకు చేరుకుని, మళ్లీ ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.
Recommended Video
కాగా- అఖిల భారత ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారు సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి వీఎం రవిశంకర్.. జస్టిస్ ఎన్వీ రమణను గౌరవపూరకంగా కలుసుకున్నారు. సమాజంలో అణగారిన, బడుగు, బలహీన, దళిత వర్గాలకు సామాజిక న్యాయాన్ని అందించేలా తీర్పులను వెలువరుస్తున్నారంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీల పట్ల దాడులు పెరుగుతున్నాయని, వాటిని నిరోధించేలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications