రక్తమోడిన రహదారులు: 13మంది మృతి
కర్నూలు/అనంతపురం: గత రెండు రోజుల్లో జరిగిన వేర్వేరు ఘోర రోడ్డు ప్రమాదాల్లో 13మంది మృతి చెందారు. కర్నూలు జిల్లా పత్తికొండ సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే.. పత్తికొండ రాజీవ్‌నగర్‌లో నివాసముంటున్న 10మంది చిరువ్యాపారులు వ్యాపారం నిమిత్తం వివిధ గ్రామాలకు వెళ్లేందుకు ఆటోలో బయల్దేరారు. పత్తికొండ శివారులోని అదోని రోడ్డు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న గుత్తి డిపోకు చెందిన ఆర్టీసి బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామలక్ష్మి, సుంకమ్మ, వీరమ్మ, డ్రైవర్ భూమా అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గద్దెరాళ్ల మృతి చెందింది.
మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారమందుకున్న ఎస్ఐ ప్రీతమ్ రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని గాయపడ్డవారిని పత్తికొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

అనంత రోడ్డు ప్రమాదాల్లో 8మంది మృతి
అనంతపురం: జిల్లాలో బుధవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందారు. గోరంట్ల మండలం బూచేపల్లి క్రాస్ వద్ద తెల్లవారుజామున ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందగా, బత్తలపల్లి మండలం పోట్లమర్రి వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. బూచేపల్లి ప్రమాదంలో పుట్టపర్తి మండలం పెడబల్లికి చెందిన ఆటోడ్రైవర్ ఆకుల విజయ్(25), ఆకుల నాగమ్మ(52), ఆకుల సుగుణ(35), ఆకుల నాగమనెమ్మ (45), వడ్డే వెంకటమ్మ (35), షరీఫ (60)లు మృతి చెందారు.
మంగమ్మ తీవ్రంగా గాయపడింది. ఆమెను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులంతా కూరగాయల వ్యాపారం చేసుకుని జీవనం సాగించేవారు. పెడబల్లి సంత కావడంతో కర్ణాటకలోని బాగేపల్లి నుంచి కాయగూరలు తెచ్చుకోవడానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారైనట్లు పోలీసులు తెలిపారు.
ద్విచక్ర వాహనాన్ని సిమెంటు లారీ ఢీకొనడంతో తాడిమర్రి మండలం నార్సింపల్లికి చెందిన వికలాంగుడైన గోగుల ఆంజనేయులు (42), వడ్డే ఆంజనేయులు (38) మృతి చెందారు. వీరు రాళ్లు కొట్టడానికి ద్విచక్రవాహనంలో వెళుతుండగా ఎదురుగా వస్తున్న సిమెంటు లారీ ఢీకొంది.












Click it and Unblock the Notifications