ఏపీలో 252 బ్లాక్ ఫంగస్ కేసులు: అందుబాటులోకి ఇంజక్షన్లు, ఆనందయ్య మందుపై త్వరలో క్లారిటీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులతోపాటు బ్లాక్ ఫంగస్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఏపీలో ఇప్పటి వరకు 252 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. చికిత్స కోసం ఇంజెక్షన్లు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు.
ఇప్పటికే జిల్లాలకు 3 వేల డోసుల ఇంజెక్షన్లు పంపామని ఏకే సింఘాల్ తెలిపారు. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ మరణాలపై ఇప్పటి వరకు సమాచారం లేదన్నారు. రాష్ట్రంలో రెమిడిసివిర్ కొరత లేదని చెప్పారు. ఇక ఆనందయ్య కరోనా మందుపై నాలుగైదు రోజుల్లో స్పష్టం వస్తుందని తెలిపారు.

ప్రయోగశాలలకు పంపిన నమూనాల నివేదికలు త్వరలోనే వస్తాయని, ఆ తర్వాత మందు పంపిణీపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. యాస్ తుఫాను తీవ్రత దృష్ట్యా ముందస్తుగా 767 టన్నుల ఆక్సిజన్‌ను సిద్ధంగా ఉంచామని వెల్లడించారు.
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ. 235.94 కోట్లు చెల్లించినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఏప్రిల్ 15 వరకు రూ. 195 కోట్లు చేశామని పేర్కొంది. ఉద్యోగుల ఆరోగ్య పథకానికి మార్చి 14 వరకు రూ. 40.58 కోట్ల బిల్లులు చెల్లించినట్లు తెలిపింది.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 15వేలకుపైగా కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. అంతేగాక, కరోనా మహమ్మారితో మరణించినవారి సంఖ్య కూడా వందకుపైగానే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 72,979 నమూనాలను పరీక్షించగా.. 15,284 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది.
తాజాగా నమోదైన 15,284 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,09,105కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 106 మంది మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 15 మంది మృతి చెందారు. ప్రకాశం జిల్లాలో 11 మంది, పశ్చిమగోదావరిలో 10 మంది, అనంతపురం, తూర్పుగోదావరి, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో 9 మంది, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో 8 మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు, కడపలో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 10,328కు చేరింది.
Recommended Video
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 20,917 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 14,00,754కి చేరింది. రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం 2,98,023 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,87,49,201 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2663 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా కడపలో 436 మంది కరోనా బారినపడ్డారు.












Click it and Unblock the Notifications