ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు: 18 లక్షలకుపైగా రికవరీ, 49వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదవువుతున్న కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతోంది. గత కొద్ది రోజులుగా 6వేలకు దిగవనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. అయితే, కరోనా టెస్టుల సంఖ్య కూడా తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 88,622 నమూనాలను పరీక్షించగా.. 4981 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 4981 కరోనా కేసులు, 38 మరణాలు
తాజాగా నమోదైన 4981 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,67,017కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 38 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా పది మంది, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో నలుగురు చొప్పున, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున, అనంతపురం, కడప, విశాఖపట్నం, విజయనగరంలో ఒక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 12,490 మృతి చెందారు.

ఏపీలో పెరుగుతున్న రికవరీ.. 49వేలకు యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 6,464 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 18,04,844కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య రెట్టింపు ఉంటోంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. ప్రస్తుతం 49,683 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,14,49,636 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 943 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా విజయనగరంలో 60 మంది కరోనా బారినపడ్డారు.

ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 283, చిత్తూరులో 854, తూర్పుగోదావరిలో 943, గుంటూరులో 267, కడపలో 238, కృష్ణాలో 372, కర్నూలులో 107, నెల్లూరులో 269, ప్రకాశంలో 380, శ్రీకాకుళంలో 500, విశాఖపట్నంలో 115, విజయనగరంలో 60, పశ్చిమగోదావరిలో 593 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,58,543, చిత్తూరులో 2,16,538 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకు మించిపొయాయి.












Click it and Unblock the Notifications