రెండోదశ పంచాయతీ పోరులోనూ ఏకగ్రీవాల హవా- టాప్ ఎక్కడో తెలుసా ?
ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల పోరులో ఏకగ్రీవాల హవా కొనసాగుతూనే ఉంది. తొలి విడతలోనే దాదాపు 500కి పైగా పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. రెండో దశలోనే దాదాపు అదే స్ధాయిలో ఏకగ్రీవమైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ఆధారంగా తెలుస్తోంది. జిల్లాల వారీగా ఏకగ్రీవమైన పంచాయతీల వివరాలను ఇవాళ ఎస్ఈసీ ప్రకటించింది.
ఏపీలో బలవంతపు ఏకగ్రీవాలకు అడ్డకట్ట వేసేందుకు ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైసీపీ సర్కారు మద్దతుతో ఏకగ్రీవాలు కొనసాగుతూనే ఉన్నాయి. తొలి విడతలోనే భారీగా ఏకగ్రీవాలు నమోదు కాగా.. ఈ నెల 13న జరిగే రెండో విడత ఎన్నికల పోలింగ్‌కు ముందే 539 పంచాయతీలు ఏకగ్రీవాలు అయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ ప్రకటించింది. దీంతో ఏకగ్రీవాల హవాకు అడ్డుకట్ట వేసేందుకు ఎస్ఈసీ చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలించడం లేదని అర్ధమవుతోంది.

తొలి విడతలో గుంటూరు, చిత్తూరు జిల్లాలు ఏకగ్రీవాల్లో టాప్ రెండు స్ధానాల్లో నిలవగా.. ఈసారి గుంటూరు, ప్రకాశం జిల్లాలు ఏకగ్రీవాల జాబితాలో ముందున్నాయి. గుంటూరు జిల్లాలో 70 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. ప్రకాశం జిల్లాలో 69 ఏకగ్రీవమయ్యాయి. ఆ తర్వాత స్దానాల్లో చిత్తూరు 62, విజయనగరం 60, కర్నూలు 57, శ్రీకాకుళం 41, కడపలో 40, కృష్ణాలో 36, నెల్లూరులో 35, విశాఖలో 22, తూర్పుగోదావరిలో 17, పశ్చిమగోదావరిలో 15, అనంతపురంలో 15 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మరో మూడు రోజుల్లో మిగిలిన చోట్ల రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి.