ఆత్మకూరులో 64.7 శాతం పోలింగ్ - వైసీపీ లక్ష్యం నెరవేరేనా..!!
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు 64.7 శాతం పోలింగ్ నమోదైంది. అధికారికంగా తుది పోలింగ్ శాతం ప్రకటించాల్సి ఉంది. ఇక, ఉదయం నుంచి పోలింగ్ అన్ని మండలాల్లోనూ కొనసాగింది. ప్రధానంగా ఇక్కడ పోటీ వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి బీజేపీ అభ్యర్ధి భరత్ మధ్య నెలకొందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మంత్రిగా ఉంటూ మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందటంలో ఉప ఎన్నిక జరిగింది. మేకపాటి గౌతమ్ సోదరుడు విక్రమ్ వైసీపీ నుంచి అభ్యర్ధిగా పోటీలో నిలిచారు.
తొలి నుంచి గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఉప ఎన్నిక అయినా.. వైసీపీ దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మండలాల వారీగా మంత్రులు..సీనియర్లకు బాధ్యతలు కేటాయించారు. అదే విధంగా బీజేపీ నుంచి ఆ పార్టీ ముఖ్యులు ప్రచారం నిర్వహించారు. అయితే, వైసీపీ ఇక్కడ గెలుపు పైన తొలి నుంచి ధీమాగా ఉంది. తమకు గెలుపు పైన అనుమానాలు లేవని..లక్ష మెజార్టీనే లక్ష్యమని చెబుతూ వచ్చింది. మంత్రులు రోజా.. జోగి రమేష్.. అంజాద్ బాషా.. అంబటి రాంబాబు.. కాకాణి గోవర్ధన్ రెడ్డి లు ప్రచారం చేసారు. లక్ష మెజార్టీ ఖాయమని చెబుతూ వచ్చారు. ఇక, నేడు పోలింగ్ సమయంలో అక్కడక్కడ దొంగ ఓట్ల పైన ఫిర్యాదులు వచ్చాయి.

ఆత్మకూరు ఉపఎన్నికల్లో మర్రిపాడు మండలం డీసీపల్లిలో దొంగ ఓట్లు కలకలం రేపాయి. బీజేపీ - వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సాయంత్రం వరకు క్యూ లైన్లలో ఓటర్లు కనిపించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. ఈ ఎన్నికలకు టీడీపీ జనసేన దూరంగా ఉన్నాయి. కాంగ్రెస్ సైతం పోటీ చేయలేదు. ఇక, వైసీపీ సాధారణ ఎన్నికలకు సిద్దం అవుతున్న సమయంలో జరుగుతున్న ఎన్నిక కావటంతో ఇక్కడ మెజార్టీ పైనే తొలి నుంచి ఫోకస్ చేసింది. దీంతో..ఇప్పుడు వైసీపీ నిర్దేశించుకున్న లక్ష్యం చేరుతుందా లేదా అనేది చూడాలి. ఈ నెల 26న ఆత్మకూరు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈవీఎంలను ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications