ఏపీలో ఎమ్మెల్యేకోటా ఎమ్మెల్సీ పోరు-ఏడుగురు వైసీపీ అభ్యర్ధుల నామినేషన్-బీఫారాలిచ్చిన జగన్..
ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఏడు స్ధానాలకు ఈ నెల 23న జరిగే ఎన్నికలకు అభ్యర్దులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.
ఏపీ శాసనమండలిలో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్ధానాలకు ఈ నెల 23న ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో వైసీపీ తరఫున ఏడుగురు అభ్యర్ధులు రంగంలోకి దిగుతున్నారు. ఈ స్ధానాలన్నీ వైసీపీ ఏకగ్రీవంగా గెల్చుకునే అవకాశం ఉండటంతో మిగతా వన్నీ లాంఛనమే కానున్నాయి.
వైసీపీ తరఫున ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను ఇప్పటికే పార్టీ విడుదల చేసింది. వీటి ప్రకారం ఏడుగురు అభ్యర్ధులు ఇవాళ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) చేతుల మీదుగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బీఫారాలు తీసుకున్నారు. అనంతరం నామినేషన్ వేసేందుకు అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. సీఎం జగన్ నుంచి బీఫారాలు అందుకున్న వారిలో మర్రి రాజశేఖర్, వివి సూర్యనారాయణ రాజు పెన్మత్స, పోతుల సునీత, కోలా గురువులు, బొమ్మి ఇజ్రాయెల్, జయమంగళ వెంకటరమణ, చంద్రగిరి ఏసురత్నం ఉన్నారు. శాసనమండలి సభ్యులుగా పోటీ చేసేందుకు తమకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి ఎమ్మెల్సీ అభ్యర్ధులు కృతజ్ఞతలు తెలిపారు.

వైఎస్ జగన్ చేతుల మీదుగా బీఫారాలు తీసుకున్న అభ్యర్ధులు అనంతరం అసెంబ్లీకి వచ్చారు. అక్కడే రిటర్నింగ్ అధికారి పీవీ సుబ్బారెడ్డికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. వీరు సమర్పించిన నామినేషన్లను రిటర్నింగ్ అధికారి మార్చి 14న పరిశీలిస్తారు. అలాగే ఈ నెల 16న నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు కూడా గడువు ఉంటుంది. అప్పటికీ అందరూ బరిలో ఉంటే వారు పోటీలో ఉన్నట్లు నిర్ధారిస్తారు. అలాగే పోటీగా నామినేషన్లేవీ రాకపోతే ఈనెల 23న ఎన్నికలకు బదులుగా ఏకగ్రీవంగా గెలిచినట్లు ప్రకటిస్తారు. పోటీ వస్తే ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.












Click it and Unblock the Notifications