ఉన్మాదం: ప్రేమించలేదని ఇంటర్ విద్యార్థిని సజీవదహనం చేశారు
పశ్చిమగోదావరి: జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించలేదన్న కారణంతో ఓ యువతి సజీవదహనం చేశాడు ఓ దుర్మార్గుడు. ప్రేమ పేరుతో వేధించడమే కాకుండా, అంగీకరించడంలేదన్న కోపంతో ఆమెపై కిరోసిన్ పోసి ఇద్దరు యువకులు నిప్పంటించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు గ్రామీణ మండలం చాటపర్రులో శనివారం సాయంత్రం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
పైడాల ఇందుమతి (17) అనే ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఈ దారుణానికి బలయింది. వివరాల్లోకి వెళితే.. చాటవర్రు గ్రామానికి చెందిన పైడాల సత్యనారాయణ, వెంకటేశ్వరమ్మ దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఓ కుమారుడు, కుమార్తె ఇందుమతి ఉన్నారు. ఏలూరులో చదువుతున్న ఇందుమతిని కొందరు ప్రేమ పేరుతో వేధిస్తుండటంతో మధ్యలోనే చదువు ఆపేసింది.

ఈ క్రమంలో మూడు రోజుల కిందట అదే గ్రామానికి చెందిన అన్నదమ్ములైన దగ్గుమిల్లి పెదవిక్కీ, దగ్గుమిల్లి చినవిక్కీలు ఆమెను వేధించారు. ఈ విషయమై ఆ యువకులకు, ఇందుమతి కుటుంబానికి మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. దీనిపై ఏలూరు గ్రామీణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని బాధితులు చెప్పారు.
ఈ నేపథ్యంలో ఇందుమతి తల్లిదండ్రులిద్దరూ శనివారం ఉదయం పశువులు మేపడానికి పొలానికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన పెదవిక్కీ, చినవిక్కీలు ఇందుమతిపై కిరోసిన్ పోసి నిప్పటించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. పొలం నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు.. కుమార్తె శరీరం పూర్తిగా కాలి కింద పడి ఉండటాన్ని గమనించారు.

వెంటనే స్థానికుల సహాయంతో ఆమెను ఆటోలో ఆస్పత్రికి తరలించారు. 90 శాతం తీవ్ర గాయాలతో ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. 'వారిద్దరు ఇంట్లోకి ప్రవేశించి నన్ను మరుగుదొడ్లోకి గెంటి, కిరోసిన్ పోసి నిప్పటించారు. అనంతరం పరారయ్యార'ని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మేజిస్ట్రేట్‌కు ఇచ్చిన మరణ వాంగ్మూలంలో ఇందుమతి తెలిపిందని సమాచారం.
అంతకుముందు తన కుమారుడు (చిన విక్కీ)ని వివాహం చేసుకోవాలని అతని తల్లి కోరిందని కూడా తన వాంగ్మూలంలో చెప్పినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను శనివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నట్లు సమాచారం.
బంధువుల ఆందోళన
యువతిని దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ బాధితురాలి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆందోళన కారుల్లో ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.












Click it and Unblock the Notifications