భార్యతో ఘర్షణ పడి .. చిన్నారులను నేలకోసి కొట్టిన కసాయి తండ్రి ; విజయనగరం జిల్లాలో దారుణం
కంటికి రెప్పలా కాపాడవలసిన తండ్రి కాలయముడయ్యాడు. కసాయిగా మారి చిన్నారులను నేలకేసి కొట్టి దారుణానికి పాల్పడ్డాడు. విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనలో భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ చిన్నారులకు శాపంగా మారింది. అభం శుభం తెలియని చిన్నారి ఉసురు తీసింది.
విజయనగరం జిల్లా సాలూరు మండలం జోడి మామిడి వలసలో జరిగిన ఈ దారుణ ఘటనలో భార్యతో గొడవపడిన భర్త అత్యంత కిరాతకంగా వ్యవహరించాడు .ఈ ఘటనకు సంబంధించి పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సాలూరు మండలానికి చెందిన ప్రసాద్, మహాలక్ష్మి ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టడంతో తన భార్య మహాలక్ష్మిని ప్రసాద్ నిత్యం వేధింపులకు గురి చేస్తున్నాడు.

అయితే రోజురోజుకు భర్త వేధింపులు ఎక్కువ కావడంతో భరించలేని స్థితిలో మహాలక్ష్మి భర్తను వదిలిపెట్టి పుట్టింటికి చేరుకుంది.జోడి మామిడి వలసలోని పుట్టింట్లో ఉన్న మహాలక్ష్మి దగ్గరికి భర్త ప్రసాద్ వచ్చి గొడవకు దిగాడు. ఇద్దరు పిల్లలను చితకబాదాడు. భార్య మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రసాద్ ఆ కోపాన్ని ఆ ఆడ పిల్లల మీద చూపించాడు. పసివాళ్ళని కూడా చూడకుండా ఇద్దరు ఆడపిల్లలను నేలకేసి కొట్టాడు. ఈ ఘటనలో రెండేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.
ఐదేళ్ళ పాప తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది. ఇక భార్య మహాలక్ష్మి తనపై దాడి చేస్తాడేమో అన్న భయంతో స్థానికుల సహాయంతో అక్కడి నుండి తప్పించుకుంది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ప్రసాద్ ను అడ్డుకుని అతడ్ని తాళ్ళతో కట్టేశారు. ఆపై పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం పోలీసులు ప్రసాద్ ని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన బాలికను ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయిస్తున్నారు.












Click it and Unblock the Notifications