
ప్రేమోన్మాది ఘాతుకం: ప్రేమను నిరాకరించిందని యువతితో పాటు తల్లి, ఇద్దరు చెల్లెళ్ళపై కత్తితో దాడి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన ప్రేమను నిరాకరించింది అన్న కోపంతో ఒక ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. ఇక అడ్డొచ్చిన కుటుంబ సభ్యుల పైన విచక్షణారహితంగా దాడి చేయడంతో ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే

కృష్ణా జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం
కృష్ణా జిల్లా పామర్రు మండలం మొవ్వ పెద్ద హరిజనవాడలో యువతి తనను ప్రేమించలేదని ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన దారుణం చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా మొవ్వ గ్రామంలో అంబేద్కర్ నగర్ లో నివసిస్తున్న మల్లారపు నాగ రాజ్యం అనే మహిళకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 2013లో ఆమె భర్త నాగేశ్వరరావు మృతి చెందాడు. ఆ తర్వాత ఆమె ముగ్గురు పిల్లలతో జీవనం సాగిస్తుంది. అయితే గత కొంత కాలంగా నాగ దేశి జోయల్ అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమె పెద్ద కుమార్తెను వేధిస్తున్నాడు.

యువతితో పాటు తల్లిపై ఆమె ఇద్దరు చెల్లెళ్ళపై ప్రేమోన్మాది దాడి
యువతి సదరు వ్యక్తిని ప్రేమించడానికి నిరాకరించడంతో నేరుగా ఆమె ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. యువతి తల్లి, ఇద్దరు చెల్లెళ్లపై కూడా దాడి చేశాడు. యువతి ఇంటికి వెళ్లి మరోసారి నాగదేశి జోయల్ ప్రేమ ప్రపోజ్ చేయగా ఆమె నిరాకరించింది. దీంతో యువతిపై ఊహించని విధంగా కత్తితో దాడి చేశాడు. నిందితుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన బాలిక తల్లి, ఇద్దరు చెల్లెళ్లను కూడా గాయపరిచారు. స్థానికులు క్షతగాత్రులను మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వెంటనే నిందితుడిని కూచిపూడి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పెద్ద హరిజనవాడకు చెందిన నాగదేసి జోయల్ అనే వ్యక్తి గత కొంతకాలంగా తమ కుమార్తెను వేధిస్తున్నాడని , తన ప్రేమను నిరాకరించిన యువతిపై కోపం పెంచుకుని, ఇంటికి వచ్చి కత్తితో దాడి చేశాడని, పోలీసులు అతనిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

పెరుగుతున్న ప్రేమోన్మాదం .. తస్మాత్ జాగ్రత్త
ప్రేమను తిరస్కరించారని ఉన్మాదులుగా మారుతున్న యువకులు, యువతులు, బాలికలపై పాశవికంగా దాడులు చేస్తూనే ఉన్నారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా అమ్మాయిలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. తమను ఎవరైనా ఇబ్బంది పెడుతున్న ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు వారిపై చర్య తీసుకోవడమో, లేదా వారికి కౌన్సిలింగ్ ఇవ్వడమో చేస్తారు. ఇక ఇదే సమయంలో యువకులు కూడా ఈ తరహా దాడులకు దిగడం వారి భవిష్యత్తు సర్వ నాశనం అవుతుందన్న విషయం గుర్తించాలి.