తిరుమలలో సెప్టెంబర్‌లో జరిగే విశేష పర్వదినాలివే..!
కళియుగ వైకుంఠ దైవమైన శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు నిత్యం భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు.ఇక, తిరుమల ఆలయంలో ప్రతినెలా విశేష ఉత్సవాలు, పండుగలు పర్వదినాలను నిర్వహిస్తారు. సెప్టెంబర్ నెలలో జరిగే విశేష ఉత్సవాల గురించి తిరుమల ఆలయ అధికారులు వెల్లడించారు. ఆ వివరాలేంటో చూసేద్దాం..
తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబరు 5వ తేదిన బలరామ జయంతి, వరాహ జయంతి కార్యక్రమాలను వైభవంగా నిర్వహిస్తారు. అలాగే, సెప్టెంబరు 7వ తేదిన వినాయక చవితి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు ఉంటాయి. సెప్టెంబరు 17న అనంత పద్మనాభ వ్రతం ఉంటుంది. సెప్టెంబరు 18వ తేదిన పౌర్ణమి శ్రీవారి గరుడసేవ కార్యక్రమం నిర్వహిస్తారు. సెప్టెంబరు 28వ తేదిన సర్వ ఏకాదశి నిర్వహిస్తారు. భక్తులు ఈ విశేష ఉత్సవాలను గమనించాలని టీటీడీ కోరింది.

ఈ నెలలో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలోని విశేష ఉత్సవాలు
తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు శ్రీ కోదండ రామాలయంలో కూడా సెప్టెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నట్లు అధికారులు తెలిపారు. వాటి వివరాలను కూడా వారు ప్రకటించారు. అవి ఇలా ఉన్నాయి. సెప్టెంబరు 3వ తేదిన అమావాస్య సందర్భంగా ఉదయం 8 గంటలకు శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సహస్ర కలశాభిషేకం ఉంటుంది. అదే రోజు రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ కార్యక్రమం నిర్వహిస్తారు. సెప్టెంబరు 7, 14, 21, 28వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్లకు అభిషేక కార్యక్రమం ఉంటుంది. వీటితో పాటు సెప్టెంబరు 18వ తేదిన పౌర్ణమి సందర్భంగా ఉదయం 8.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం ఉంటుంది.
అదేరోజు సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం కార్యక్రమం జరుగుతుంది. అదేరోజు సాయంత్రం 6.30 గంటలకు ఆస్థానం చేపడతారు. సెప్టెంబరు 26వ తేదిన పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. ఇక, అదేరోజు సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవార్లను తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. అదే రోజు సాయంత్రం 6.30 గంటలకు ఊంజల్‌సేవ కూడా జరుపుతారు.












Click it and Unblock the Notifications