వివాహేతర బంధం: ప్రియుడి కోసం పెళ్లైన 3నెలలకే భర్తను చంపేసింది
పశ్చిమగోదావరి: వివాహేతర బంధం కోసం కట్టుకున్న భర్తనే హతమార్చింది ఓ దుర్మార్గురాలు. ప్రియుడితో కలిసి విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి ఈ దారుణానికి పాల్పడింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో బుధవారం వెలుగులోకి వచ్చింది.

ఆలస్యంగా వెలుగులోకి..
వివరాల్లోకి వెళితే.. ఆగస్టు 29న దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని నిర్మలగిరి క్షేత్రంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేయగా మృతుడు తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామానికి చెందిన చేగొండి భీమశంకరంగా (25) తేలింది.

ముందునుంచే..
ఆయనకు ఈ ఏడాది మే నెలలో జయలక్ష్మితో వివాహమైంది. ఆమె ద్రాక్షారామంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తోంది. కాగా, అదే ఆసుపత్రిలో పనిచేసే సహోద్యోగి వీరేష్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో ఆగస్టు 29న గుడికి వెళదామంటూ భర్త భీమశంకరంను జయలక్ష్మి గౌరీపట్నంలోని నిర్మలగిరికి తీసుకొచ్చింది.

పథకం ప్రకారమే..
ముందే వేసుకున్న పథకం ప్రకారం వీరిని వీరేష్ అనుసరించాడు. గుడిచుట్టూ ప్రదర్శనల అనంతరం తనకు నీరసంగా ఉందని భీమశంకరం చెప్పడంతో ఓ హైపవర్ డ్రగ్‌ను ఇంజెక్షన్ ద్వారా అతని శరీరంలోకి ఎక్కించింది జయలక్ష్మి. దీంతో కొద్దిసేపటికే అతడు మృతి చెందాడు.

కటకటాల వెనక్కి..
ఆ తర్వాత భీమశంకరంను అక్కడే వదిలేసి పరారయ్యారు. కాగా, దర్యాప్తులో ఈ దారుణం వెలుగుచూడటంతో జయలక్ష్మిని, ఆమెకు సహకరించిన వీరేష్‌ను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications