ఆంధ్రజ్యోతి నిలిపివేత: టి సర్కారు స్పందనకోసం హైకోర్టు
హైదరాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 ఛానల్ ప్రసారాల పునరుద్ధరణ వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో... తెలంగాణ ప్రభుత్వం స్పందన కోసం కొంత సమయం వేచి చూడాలని రాష్ట్ర హైకోర్టు అభిప్రాయపడింది. పిటిషన్ పైన తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ వి అఫ్జల్ పుర్కర్ ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రసారాలను పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థిస్తూ ఆ ఛానల్ అసోసియేట్ ఎడిటర్ మూర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ పిటిషన్ పైన గురువారం హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. కేంద్రం తరఫున సహాయ సొలిసిటర్ జనరల్ విష్ణువర్ధన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ... ప్రసారాలను ఆపివేయడం చట్ట విరుద్దమన్నారు. ఛానల్ ప్రసారాల పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిందన్నారు.
సంబంధిత లేఖలను కోర్టు దృష్టికి తెచ్చారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి.. తెలంగాణ సర్కారు నిర్ణయం కోసం కొంత సమయం వేచి చూద్దామని, కేంద్రం పంపిన లేఖల వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో వచ్చే విచారణ నాటికి తెలపాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది.












Click it and Unblock the Notifications