చంద్రబాబుపై పీటీ వారెంట్- విచారణ వాయిదా..!!
అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.
2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

అరెస్టయినప్పటి నుంచి చంద్రబాబు బెయిల్, క్వాష్ పిటీషన్లపై పోరాటం చేస్తోన్నారు. తనపై ఏపీ సీఐడీ అధికారులు పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు అక్రమం అని, దాన్ని కొట్టివేయాలనేది చంద్రబాబు వాదన. ఆ ఉద్దేశంతోనే ఆయన క్వాష్ పిటీషన్‌ను దాఖలు చేశారు. మొదట ఏపీ హైకోర్టు దీన్ని డిస్మిస్ చేయగా.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాం కేసు దర్యాప్తు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ సీఐడీ అధికారులు మూడు కేసులను తెరమీదికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు చెబుతున్న ఫైబర్ నెట్, ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం అంగళ్లు వద్ద అల్లర్లు- పోలీసులపై దాడి, రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అలైన్‌మెంట్ మార్పు కేసులను నమోదు చేసింది.
ఆయా కేసుల్లో విచారించడానికి చంద్రబాబును తమ కస్టడీకి అప్పగించాలని విజ్ఞప్తి చేస్తూ సీఐడీ అధికారులు విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో ఇదివరకు పీటీ వారెంట్‌ను ఫైల్ చేశారు. ఈ పీటీ వారెంట్‌పై ఇవ్వాళ విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ- అది వాయిదా పడింది. బుధవారానికి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. రేపు ఉదయం దీనిపై విచారణ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications