అవినీతి చిట్టా విప్పుతా: మంత్రులకి శివాజీ హెచ్చరిక, అన్నీ రికార్డ్‌లే: బాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని శంకుస్థాపన అనంతరం... ప్రత్యేక హోదా పైన కేంద్రం నుంచి ప్రకటన రావాలని, లేదంటే కేంద్రమంత్రుల అవినీతి చిట్టా బయటపెడతామని ప్రత్యేక హోదా సాధనా సమాఖ్య నాయకుడు, ప్రముఖ నటుడు శివాజీ బుధవారం నాడు హెచ్చరించారు.
హైదరాబాదులో హోదా సాధనా సమాఖ్య సమావేశమైంది. నటుడు శివాజీతో పాటు చలసాని శ్రీనివాస్, కారెం శివాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడారు. అక్టోబర్ 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక హోదా కోసం ర్యాలీలు నిర్వహిస్తామన్నారు.

మావి అన్నీ రికార్డులే: చంద్రబాబు
కొత్తగా ఏర్పడిన ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో రికార్డులను సృష్టించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. భెల్ శంకుస్థాపనకు ముందు ఆయన జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకరించకపోయినప్పటికీ రైతులకు రుణమాఫీ చేశామన్నారు. పట్టిసీమ ప్రాజెక్టును రికార్డు స్థాయిలో ఐదు నెలలా 20 రోజుల్లో పూర్తి చేసి రికార్డును సృష్టించామన్నారు.
ఈ ప్రాజెక్టు నుంచి నీటిని కృష్ణాకు మళ్లించి, హంద్రీనీవా, గాలేరు - నగరి, పోతిరెడ్డి పాడు ప్రాజెక్టులకు వంద టీఎంసీల నీటిని మళ్లిస్తామని, తద్వారా రికార్డును సృష్టిస్తామన్నారు. అక్టోబర్ 22న దసరా పర్వదినం నాడు రాజధాని శంకుస్థాపనకు పలు దేశాల అధినేతలు హాజరవుతారన్నారు.

ఈ కార్యక్రమాన్ని ఎప్పటికీ గుర్తుండేలా నిర్వహిస్తామన్నారు. రైతులకు మంచి రోజులు రానున్నాయని, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు. జిల్లాల్లో రూ.500 కోట్లతో బెల్ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.
రైతు రుణాల మాఫీ కోసం ఎవరూ ఇవ్వనంత నిధులను ఇస్తున్నామన్నారు. అనంతపురం వాసుల జీవితాల్లో కరవు లేకుండా చేస్తామన్నారు. రూ.200 కోట్లతో వ్యవసాయ ఆధునికీకరణకు శ్రీకారం చుట్టామని, రైతులకు 50 శాతం రాయితీపై ట్రాక్టర్లను అందిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications