
ఆదికవి నన్నయ యూనివర్సిటీలో గంజాయి కలకలం.. యువతే టార్గెట్ గా దందా
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఉన్న ఆదికవి నన్నయ యూనివర్సిటీలో గంజాయి కలకలం రేగింది. నన్నయ హాస్టల్ లో 15 మంది విద్యార్థులు గంజాయికి అలవాటు పడినట్టు యూనివర్సిటీ అధికారులు గుర్తించారు. ఇక ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసిన యూనివర్సిటీ అధికారులు ఇందుకు సూత్రధారిగా భావిస్తున్న విద్యార్థికి ఇప్పటికే టీ సి ఇచ్చి పంపించేశారు.
ట్రాక్టర్లు, లారీలలో సీక్రెట్ లాకర్లు.. పుష్ప సినీఫక్కీలో జరుగుతున్న దందా చూసి పోలీసులే షాక్!!

ఏజెన్సీ నుండి యూనివర్సిటీ హాస్టల్ కు గంజాయి.. నన్నయ హాస్టల్ లో మత్తులో యువత
నన్నయ హాస్టల్ లో ఉంటూ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థి వీకెండ్లో విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లి హాస్టల్ కు గంజాయి తీసుకొస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ గంజాయిని హాస్టల్ లో విద్యార్థులకు ఇస్తున్నట్టు గుర్తించారు. దీంతో విద్యార్థులు గంజాయికి అలవాటు పడ్డారన్న విషయం తెలిసిన తరువాత యూనివర్సిటీ అధికారులు గంజాయి కి అలవాటు పడిన విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిని సన్మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. గంజాయి వినియోగిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను పిలిచి వారికి కూడా సమాచారం అందించిన యూనివర్సిటీ అధికారులు గంజాయి అలవాటు మానుకోకుంటే టీసీలు ఇచ్చి పంపిస్తామని హెచ్చరించినట్లు సమాచారం.

గంజాయి ఘటనపై అధికారుల విచారణ
ఇక ఇదే విషయాన్ని యూనివర్సిటీ వీసీ ఆచార్య జగన్నాథ రావు వెల్లడించారు .నన్నయ క్యాంపస్ లో గంజాయి నివారణ కోసం స్పెషల్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేసినట్లు వీసీ ఆచార్య జగన్నాథ్ రావు తెలిపారు. గంజాయి ఘటనపై విచారణ జరిపామని ఇప్పటికే ఓ విద్యార్థిని సెమిస్టర్ పరీక్షలను ని సస్పెండ్ చేశామని వి సి జగన్నాధ రావు వెల్లడించారు. ఇక రిటైర్డ్ మిలిటరీ అధికారి సెక్యూరిటీగా నియమించనున్నామని పేర్కొన్నారు.

యూనివర్సిటీలు, కళాశాలలలో చాపక్రింద నీరులా గంజాయి
ఒక్క ఆదికవి నన్నయ యూనివర్సిటీ లోనే కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక యూనివర్సిటీల వద్ద యువతను టార్గెట్ చేసి గంజాయి స్మగ్లర్లు యధేచ్చగా గంజాయి దందాను కొనసాగిస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో విజయవాడ కేంద్రంగా ఉన్న కళాశాలల్లో గంజాయి దందా జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి గంజాయి యదేచ్చగా అక్రమ రవాణా జరుగుతుండడంతో యువతను టార్గెట్ చేసుకుంటున్న అక్రమార్కులు వారిని గంజాయి మత్తులోకి దించుతున్నారు అని తెలుస్తుంది.

యువతను మత్తుకు బానిసలు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది
ఏది ఏమైనా యూనివర్సిటీలు, కళాశాలలు వద్ద గంజాయి దందాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తుంది. ఇక ఇదే సమయంలో పెడదారిన వెళుతున్న యువతను, మత్తుకు బానిసలు కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం పైన, సదరు కళాశాలల యాజమాన్యం పైన, తల్లిదండ్రుల పైన ఎంతైనా ఉంది.