కెసిఆర్ వల్లే: భద్రాచలం ముంపు మండలాలపై ఆగ్రహం!
ఖమ్మం: పోలవరం ప్రాజెక్టు కోసం ఏడు ముంపు మండలాలను ఆంధ్రలో కలిపిన విషయం తెలిసిందే. ముంపు మండలాలను ఆంధ్రలో కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని తెరాస అధ్యక్షులు, కాబోయే తెలంగాణ సిఎం కెసిఆర్ తీవ్రంగా ఖండించి, గురువారం బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే దీనికి కెసిఆరే కారణమని ఇంకొందరు ధ్వజమెత్తుతున్నారు.
జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఏర్పాటవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని జిల్లాలు వేడుకలకు సిద్ధమవుతున్నాయి. అదే సమయంలో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రలో కలపడం పట్ల పార్టీలు, నేతలు, ఆదివాసులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.
దీనిపై పలువురు కెసిఆర్ పైన నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణ కోసం డిమాండ్ చేసిన కెసిఆర్.. తమకు 1956కు ముందు తెలంగాణ కావాలని పలుమార్లు చెప్పారని, ఇది సీమాంధ్ర నాయకులకు అవకాశంగా దొరికిందని పలువురు నిప్పులు చెరుగుతున్నారు.

1956కు ముందు భద్రాచలం డివిజన్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేదని, అప్పటి తెలంగాణ కావాలని కెసిఆర్ చెప్పడం వల్ల వారికి అవకాశమిచ్చారని ధ్వజమెత్తుతున్నారు. గతంలో తెలంగాణ టిడిపి, బిజెపి, తెలంగాణ కాంగ్రెసు నేతలు కూడా కెసిఆర్ పైన ఈ విషయమై విమర్శలు గుప్పించారు. 1956కు ముందు తెలంగాణ అంటే భద్రాచలం సీమాంధ్రకు వెళ్తుందని, కెసిఆర్ తన వ్యాఖ్యల ద్వారా నష్టం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
విభజన ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే.. పోలవరం కోసం భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలిపేస్తారని జోరుగా ప్రచారం సాగినా కెసిఆర్ పెద్దగా వ్యతిరేకించలేదని ఖమ్మం జిల్లాలో పలువురు విమర్శలు గుప్పిస్తున్నారట.
ఏడు మండలాలను ఆంధ్రలో కలుపుతూ యూపిఏ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిందని, అయితే ఎన్నికల కోడ్ కారణంగా అప్పుడు విడుదల కాలేదని, ఇప్పుడు వచ్చిందని, అంతా అయిపోయాక ఇప్పుడు ఎంత తీవ్రంగా స్పందిస్తే ఏమిటనే వారు కూడా లేకపోలేదు. వెంక్యయ నాయుడు వంటి సీమాంధ్ర నేతలు ఏడు మండలాలను ఆంధ్రలో కలిపేందుకు యూపిఏ ప్రభుత్వం ఉన్నప్పటి నుండే ప్రయత్నాలు చేశారని, అప్పుడు ఎందుకు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications