అమరావతి రైతుల కొత్త నినాదం - సీఎం జగన్ పై ఒత్తిడి పెంచేలా : కోర్టు తీర్పుతో..!!
అమరావతి రైతు జేఏసీ కొత్త నిర్ణయం తీసుకుంది. తమ పోరాటంలో కీలక మార్పు చేసారు. తాజాగా హైకోర్టు అమరావతికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా..ఉద్యమం కొనసాగించాలని నిర్ణయించారు. కోర్టు తీర్పు అనంతరం రైతులు - మహిళా నేతలు హైకోర్టు ముందు సాష్ఠాంగ నమస్కారాలు చేసారు. విధులు ముగించుకొని వెళ్తున్న న్యాయమూర్తులను దారి మొత్తం రైతులు ధన్యవాదాలు చెబుతూ బారులు తీరారు. ఇక, కోర్టు తీర్పు అమలు చేసే వరకూ ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని నిర్ణయించారు.
Recommended Video

కొత్త నినాదంతో పోరాటం
అందులో భాగంగా.. ఇప్పటి వరకు నినదించిన నినాదంలో సైతం మార్పులు చేసారు. ఇకపై 'సేవ్ అమరావతి-సేవ్ ఆంధ్రప్రదేశ్' నినాదంతో కాకుండా.. 'సేవ్ ఆంధ్రప్రదేశ్- బిల్డ్ అమరావతి'తో ముందుకెళ్లాలని నిర్ణయించారు. కోర్టు ఏపీ శాసనసభకు రాజధాని మార్పు అధికారం లేదని స్పష్టం చేసింది. ఒక రాష్ట్ర అసెంబ్లీ, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలను ఏర్పాటు చేసే అధికారం ఒక్క పార్లమెంటుకు మాత్రమే ఉందని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం గురువారం ఇచ్చిన తీర్పులో తేల్చిచెప్పింది. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందిని కోర్టు స్పష్టం చేసింది. అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని సూచించింది. ఇదే సమయంలో.. రైతులతో చేసుకున్న ఒప్పందం మేరకు వారికి డెవలప్ చేసిన ప్లాట్లను ఇవ్వటంతో పాటుగా ఆరు నెలల్లో నిర్మాణాలు పూర్తి చేయాలని పేర్కొంది.

ప్రభుత్వం ఏం చేయనుంది
అయితే, కోర్టు తీర్పు పైన ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష చేసారు. అడ్వకేట్ జనరల్ తో పాటుగా మంత్రులు బొత్సా.. బుగ్గన తో చర్చించారు. న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్నారు. అయితే, హైకోర్టు తీర్పు పైన సుప్రీంకు అప్పీల్ కు వెళ్లాలా వద్దా అనే అంశం పైన నిర్ణయం వాయిదా వేసారు. హైకోర్టు శాసనసభకు రాజధాని మార్చే అధికారం లేదంటూ ప్రస్తావించిన తీర్పులను మరింతగా అధ్యయనం చేయాలని నిర్ణియించారు. కానీ, తమ విధానం మూడు రాజధానులే అనే అంశాన్ని మంత్రి బొత్సా మరోసారి స్పష్టం చేసారు. కానీ, తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే సమగ్రంగా మరోసారి మూడు రాజధానుల బిల్లులను ప్రవేశ పెడతామంటూ మంత్రులు చేసిన వ్యాఖ్యలు..ప్రస్తుతం అమలయ్యే అవకాశం కనిపించటం లేదు.

ముందుకే అని చెబుతున్నా..
అయితే, ప్రజలందరి అభిప్రాయంతో ముందుకు వెళ్తామని చెప్పటం ద్వారా.. ప్రభుత్వం సైతం ఆచితూచి అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. ఇక, కోర్టు తీర్పుతో అమరావతి నుంచి రాజధాని మార్చే అవకాశం లేదనే నమ్మకం అమరావతి రైతుల్లో కనిపిస్తోంది. సీఎం జగన్...ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే విధంగా అమరావతి జేఏసీ కొత్త నినాదం ఎంచుకుంది. అందరితో చర్చలు చేస్తామని కొద్ది రోజులుగా చెబుతూ వస్తున్న ప్రభుత్వం..అమరావతి రైతులతోనూ చర్చలు చేస్తుందా అనేది ఇప్పుడు చర్చకు కారణమైంది. అయితే, తాము సీఆర్డీఏ చట్టాన్ని తిరిగి అమలు చేస్తున్నామంటే అందులో అంశాలను అమలు చేస్తామనే కదా అంటూ బొత్సా సమాధానం ఇచ్చారు.

సీఎం జగన్ నిర్ణయం పై ఉత్కంఠ
దీని ద్వారా కోర్టు చెప్పిన విధంగా డెవలప్ చేసిన ప్లాట్లు రైతులకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దం అవుతోందని తెలుస్తోంది. అయితే, కోర్టు నిర్దేశించిన విధంగా ఆరు నెలల్లో నిర్మాణం మాత్రం సాధ్యమయ్యేలా కనిపించటం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీని పైన కోర్టులోనే ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక, వైసీపీ మినహా ఇతర రాజకీయ పక్షాలు అమరావతి రైతులను ప్రశంసిస్తున్నాయి. జేఏసీ నేతలను కలిసేందుకు పలు పార్టీల నేతలు అమరావతికి రానున్నారు.












Click it and Unblock the Notifications