విశాఖలో చిన్నపక్షి దెబ్బకు వణికిపోయిన ఎయిర్ ఇండియా, 103మంది ప్రయాణికులు!
ఎయిర్ ఇండియా.. ఈ పేరు చెప్తేనే ఇటీవల కాలంలో జరిగిన విమాన ప్రమాద ఘటన అందరికీ గుర్తొస్తుంది. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ విషాదంలో 274మంది మృతి చెందారు. అప్పట్నుంచి ఎయిర్ ఇండియా విమానాలలో ఏ సంఘటన జరిగిన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. తాజాగా ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి అటువంటి ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది.
విమానం ఇంజన్ లోకి పక్షి.. ప్రయాణికులను ప్రమాదం నుండి కాపాడిన పైలెట్
విశాఖపట్నం నుండి హైదరాబాద్ కు బయలుదేరిన విమానం గాలిలోకి లేచిన కొద్దిసేపటికే తిరిగి విశాఖ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత ఒక పక్షి ఇంజన్లోకి దూసుకుపోయింది. దీంతో ఇంజన్లో ఉన్న రెక్కలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఇక ఈ విషయాన్ని వెంటనే గుర్తించిన పైలెట్ అప్రమత్తం అయ్యాడు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు వెంటనే సమాచారం అందించాడు. ఆపై విమానాన్ని సురక్షితంగా విశాఖ విమానాశ్రయంలో ల్యాండ్ చేశాడు.

103 మంది సేఫ్..వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
మొత్తం ఈ విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి 103 మంది ఉన్నారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా వీరందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పినట్టు అయింది. ఇక విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లడానికి ఫ్లైట్ ఎక్కిన ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఎయిర్ ఇండియా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసింది.
సోషల్ మీడియాలో పోస్టులు
పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడం వల్ల విమానంలో ఎక్కిన ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ఎయిర్ ఇండియా యాజమాన్యం కూడా పైలెట్ ను అభినందించింది.అయితే ఈ విషయం తెలిసిన చాలామంది ఒక చిన్న పక్షి కారణంగా అంత పెద్ద విమానం ఎగర లేకపోయిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఒక చిన్న పక్షి 103 మంది ప్రాణాలను డేంజర్ జోన్లోకి నెట్టే ప్రయత్నం చేసిందని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. అంత పెద్ద విమానం చిన్న పక్షి దెబ్బకు దిగొచ్చింది అని కూడా కామెంట్స్ చేస్తున్న వారు లేకపోలేదు.












Click it and Unblock the Notifications