ఆళ్లగడ్డ: జగన్ పార్టీ అభ్యర్థిగా అఖిలప్రియ (ఫొటో)
హైదరాబాద్: కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ శాసనసభ ఉప ఎన్నికకు తమ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియ పేరును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో శోభానాగిరెడ్డి ప్రచారం ముగించుకుని వస్తున్న సమయంలో కారు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన ఆళ్లగడ్డ ఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధించారు. దీంతో మళ్లీ ఆళ్లగడ్డకు ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఈ నేపథ్యంలో ఇటీవల ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికకు అక్టోబర్ 14 నోటిఫికేషన్ జారీ కానుంది. అక్టోబర్ 14న నోటిఫికేషన్, నవంబర్ 8న ఆళ్లగడ్డలో ఉప ఎన్నిక నిర్వహించనున్నామని ఎన్నికల సంఘం ప్రకటించింది. 12వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని పేర్కొంది.అక్టోబర్ 21 నుంచి నామినేషన్లు వేసుకోవచ్చని, 22న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని తెలిపింది. 24 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఇది ఇలా ఉండగా ఆళ్లగడ్డ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు అన్ని పార్టీలతో సంప్రదింపులు చేయడం కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి.. ఎంవి మైసూరారెడ్డి, ధర్మాన ప్రసాదరావులతో కూడిన ద్విసభ్య కమిటీని నియమించారు.












Click it and Unblock the Notifications