అంతర్జాతీయ కోర్టుకు చేరిన అమరావతి - రైతుల పిటిషన్
అమరావతి నుంచి ఏపీ రాజధానిని విశాఖకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ కొన్నిరోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్న స్ధానిక రైతులు ఇప్పుడు హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. అమరావతి నుంచి రాజధాని తరలింపు పేరుతో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని రైతుల తరఫున అమెరికా ఎన్నారై ఒకరు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అమరావతి మరోసారి అంతర్జాతీయంగా వార్తలకెక్కింది

అంతర్జాతీయ కోర్టుకు మారిన అమరావతి సీన్
ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియను వ్యతిరేకిస్తూ ప్రతిరోజూ నిరసనలు తెలుపుతున్న 29 గ్రామాల రైతులు ఇప్పుడు ఏకంగా హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. మూడు రాజధానుల నిర్ణయం, అమరావతి నుంచి రాజధాని తరలింపు వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని, హక్కుల ఉల్లంఘన కూడా జరుగుతుందని రైతులు తమ పిటిషన్ లో ఆరోపించారు. దీంతో ఇప్పుడు అమరావతి వ్యవహారం దేశంలో కోర్టుల నుంచి అంతర్జాతీయ కోర్టులకు చేరినట్లయింది.

అమరావతి రైతుల తరపున ఎన్నారైల పిటిషన్
అమరావతి రైతుల తరఫున అమెరికాకు చెందిన ఎన్నారైలు ఈ పిటిషన్ దాఖలు చేశారు. అమెరికాకు చెందిన ఎన్నారై కావేటి శ్రీనివాస్ తో పాటు మరికొందరు స్ధానిక ఎన్నారైలు అమరావతి రైతుల పక్షాన ఈ పిటిషన్ దాఖలు చేశారు. అమరావతి ఉద్యమాన్ని అణగదొక్కే క్రమంలో వైసీపీ ప్రభుత్వం అన్ని రకాల మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని వీరు తమ పిటిషన్ లో ఆరోపించినట్లు తెలుస్తోంది. తక్షణం జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని వారు న్యాయస్ధానాన్ని కోరారు.

అమరావతిపై ఇంటర్నేషనల్ కోర్టు విచారణ
అమరావతి నుంచి రాజధాని తరలింపుపై రైతులు దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించి అంతర్జాతీయ న్యాయస్ధానం త్వరలోనే సీరియల్ నంబరు కేటాయించి విచారణ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. కాబట్టి దీనిపై ప్రతివాదులందరికీ కోర్టు నోటీసులు జారీ కానున్నాయి.
Recommended Video


త్వరలో ఐరాసకూ ఫిర్యాదు చేయనున్న రైతులు
అమరావతి నుంచి రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా అంతర్జాతీయ కోర్టులో పిటిషన్ వేసిన రైతులు, త్వరలో ఐక్యరాజ్యసమితికి చెందిన మానవహక్కుల సంఘాన్నీ ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. అమరావతిలో తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపిస్తున్న రైతులు తక్షణం ఐరాస కూడా జోక్యం చేసుకోవాలని కోరనున్నారు.
రైతుల పిటిషన్ల వ్యవహారం ఎలా ఉన్నా అమరావతి మరోసారి అంతర్జాతీయంగా వార్తల కెక్కడం కలకలం రేపుతోంది.












Click it and Unblock the Notifications