అవాకులు, చెవాకులు పేలితే మర్యాదగుండదు.. జాగ్రత్త!!
అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన అన్నదాతలకు కోపం వచ్చింది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వారు చేస్తున్న పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో సాగుతోంది. ఈ సందర్భంగా పాదయాత్ర జరిగే ప్రాంతంలో ''అమరావతి కోసం పాదయాత్ర చేస్తున్న రైతులంతా నిజమైనవారు కాదని, పెయిడ్ ఆర్టిస్టులని, రైతుల ముసుగులో ఉన్న ఫేక్ యాత్రికులంటూ'' వాటిల్లో రాసివుంది. ''గో బ్యాక్ గోబ్యాక్'' అంటూ ఫ్లెక్సీలను ముద్రించారు.
తాడేపల్లి గూడెం మండలం వెంకటరామన్న గూడెం నుంచి తాడేపల్లిగూడెం టౌన్ వరకు ఈ ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు ఏర్పాటు చేశారు. దీనిపై మీడియాతో మాట్లాడిన రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ నుంచి అరసవెల్లి వరకు
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత పరిధిలోని 29 గ్రామాలకు చెందిన అన్నదాతలు గత నెల 12వ తేదీన ''అసెంబ్లీ టు అరసవెల్లి'' పేరుతో అసెంబ్లీ నుంచి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి సూర్యభగవానుడి దేవాలయం వరకు 60 రోజులపాటు పాదయాత్ర ప్రారంభించారు. 23 రోజులకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెం వరకు నడిచారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ నియోజకవర్గంలో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి.

ఫేక్ యాత్రికులు గో బ్యాక్.. గో బ్యాక్
''రాష్ట్రం కోసం జగన్ ఆరాటం.. 29 గ్రామాల కోసం బాబు నకిలీ పోరాటం.. రైతుల ముసుగులో ఫేక్ యాత్రికులూ గో బ్యాక్.. గోబ్యాక్'' అంటూ రాసివున్న ఫ్లెక్సీలు రైతులు పాదయాత్ర చేస్తున్న దారిపొడవునా ఏర్పాటు చేశారు. వీటిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు తాము ప్రభుత్వానికి పొలాలిచ్చిన పత్రాలు, పాదయాత్రకు పోలీసులిచ్చిన గుర్తింపుకార్డులు, ఆధార్ కార్డులను మీడియాకు చూపించారు. ఎవరు రైతులో, ఎవరు పెయిడ్ ఆర్టిస్టులో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.

పాదయాత్రను అడ్డుకునేందుకు పిలుపునిచ్చిన మంత్రి బొత్స
మూడు రాజధానులకు అనుకూలంగా, అమరావతికి వ్యతిరేకంగా పాదయాత్రను అడ్డుకుందాం.. అందరూ తరలిరావాలంటూ మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. కాకినాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో మూడు రాజధానులకు అనుకూలంగా రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు పాదయాత్ర పొడవునా రైతులకు మద్దతు తెలియజేసేందుకు ఆయా ప్రాంతాల్లోని రైతులు, ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఈ యాత్ర ఎటు మలుపు తిరుగుతుందోననే ఉత్కంఠ అందరిలో నెలకొంది.












Click it and Unblock the Notifications