అమరావతిలో భూసేకరణపై మంత్రి క్లారిటీ..! రైతులకు కీలక సూచన..!
ఏపీలో అమరావతి రాజధాని పనులు చురుగ్గా సాగుతున్నాయి. గతంలో మూడు రాజధానుల ప్రతిపాదన కారణంగా ఐదేళ్ల పాటు నిలిచిపోయిన పనుల్ని శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ఇందులో భాగంగా రెండో విడతలో భూముల సేకరణ విషయంలో ఇబ్బందులు రావడంతో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని మంత్రుల కమిటీకి అప్పగించింది. కమిటీ సిఫార్సు ఆధారంగా త్వరలో దీనిపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అయితే తొలి విడతలో ఇంకా భూములివ్వని రైతుల విషయంలోనూ త్వరలో తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
తొలి విడత భూముల సేకరణలో భూసమీకరణకు అంగీకరించని రైతులకు భూసేకరణ విధానాన్ని అమలు చేసేందుకు వీలుగా తాజాగా సీఆర్డీఏ అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే దీనిపై కేబినెట్ లో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి నారాయణ ఇవాళ తెలిపారు. అమరావతిలోని నిర్మాణాల పురోగతి తెలుసుకునేందుకు విస్తృతంగా పర్యటించిన నారాయణ.. ఆయా నిర్మాణ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. అమరావతిలో మిగిలిన కొద్ది భూములను భూసేకరణ ద్వారా తీసుకునేందుకు అధారిటీ ఆమోదించిందని, భూసేకరణ కంటే భూసమీకరణ వల్ల రైతులకు ఎక్కువ లాభమని ఈ సందర్భంగా నారాయణ రైతులకు తెలిపారు.

ఇవాళ నేలపాడు లో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ అధికారుల టైప్ -1,టైప్ 2 ఇళ్లను మంత్రి నారాయణ పరిశీలించారు.
పనుల పురోగతిపై సీఆర్డీయే ఇంజినీర్లు,కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పన వేగవంతం చేయాలని సూచించారు. అమరావతిలో గెజిటెడ్ ,గ్రూప్-డి అధికారుల కోసం మొత్తం 14 టవర్స్ లో 1440 ఇళ్లు నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. టైప్ -1 లో 384 ఇళ్లు,టైప్ - 2 లో 336 ఇళ్లు,గ్రూప్ - డి అధికారుల కోసం 720 ఇళ్లు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 31 లోగా అన్ని టవర్లను పూర్తిచేస్తామన్నారు.

రోడ్లు,డ్రెయిన్లు పనులు వేగంగా జరుగుతున్నాయని, ఫిబ్రవరి 1 కల్లా నిర్మాణం పూర్తి చేసి అధికారులకు అప్పగిస్తామని నారాయణ తెలిపారు. ఐఏఎస్ అధికారుల టవర్ల నిర్మాణం దాదాపు పూర్తయిందన్నారు. మొత్తం 4400 ఇళ్లలో 3750 ఇళ్లను వచ్చే మార్చి నాటికి అధికారులకు,ఉద్యోగులకు అప్పగిస్తామన్నారు.ట్రంక్ రోడ్లు ఏడాదిలో,లే అవుట్ రోడ్లు రెండున్నరేళ్లలో,ఐకానిక్ టవర్లను మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. అమరావతి గురించి ఏసీ రూములో కూర్చుని కొంతమంది ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, అమరావతి మునిగిపోయిందనీ దుష్ప్రచారం చేస్తున్నారని నారాయణ ఆక్షేపించారు. అమరావతి రాజధాని గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలే ఛీకొడతారన్నారు.












Click it and Unblock the Notifications