హెరిటేజ్ కోసమే మజ్జిగ, పవన్ కళ్యాణ్ చెప్పినా బాబుకు సిగ్గులేదు: అంబటి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసమ్మర్దం గల ప్రాంతంలో మజ్జిగ అందివ్వాలన్న చంద్రబాబు నిర్ణయంపై వైసిపి నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. హెరిటేజ్‌లో మజ్జిగ, పాలు, పెరుగు అమ్ముకునేందుకే ఈ పథకం అన్నారు. చంద్రబాబు నీటి ఎద్దడి, కరువును కూడా డబ్బు సంపాదనకు వాడుకుంటున్నారన్నారు.
లోకేష్, టిడిపి కార్యకర్తల జేబుల్లోకి వెళ్లేందుకు మజ్జిగ పథకాన్ని ప్రవేశ పెడుతున్నారన్నారు. ప్రతి విషయాన్ని డబ్బు సంపాదనకు వాడుకోవడం చంద్రబాబుకు అలవాటే అన్నారు. అసలు అంతకుముందు ప్రకటించిన ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ఏమయిందని నిలదీశారు.
రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుగా.. రాష్ట్రం ఎండలతో మండిపడిపోతుంటే చంద్రబాబు మాత్రం రాజ్యసభ, మంత్రులకు ర్యాంకులు అంటూ కేబినెట్లో చర్చించడం విడ్డూరమన్నారు. రాష్ట్రంలో జనం గుక్కెడు నీళ్లు లేకుండా అల్లాడుతున్నారన్నారు.

అయినా, మంత్రులకు చంద్రబాబు ర్యాంకులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. మంత్రులకు ప్రజలు ర్యాంకులు ఇవ్వాలన్నారు. మంత్రి పీ నారాయణకు ఎక్కడో చివర ర్యాంకు ఇచ్చారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన నారాయణకే చివరి ర్యాంకు రావడం ఏమిటన్నారు.
కానీ, అదే నారాయణకు చెందిన కాలేజీల గురించి రేపటి నుంచి మనం నెంబర్ వన్ అని చూస్తామని ఎద్దేవా చేశారు. ర్యాంకులు ఇవ్వాల్సింది ప్రజలని, చంద్రబాబు కాదన్నారు. అవినీతిలో ఆరితేరారని ర్యాంకులు ఇచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు నచ్చిన వాళ్లకు మొదటి ర్యాంకులు ఇచ్చారన్నారు. నచ్చకుంటే చివరి ర్యాంకులు ఇచ్చారన్నారు. సీనియర్ మంత్రులకు ర్యాంకులే లేవన్నారు.
జలీల్ ఖాన్ సవాల్ స్వీకరిస్తున్నాం
తాను రాజీనామా చేసి, పోటీ చేసినా తిరిగి గెలుస్తానని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు అంబటి చెప్పారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆ సవాల్ చేయాలన్నారు. అప్పుడు మేం కూడా సిద్ధమని చెప్పారు.
తమ పార్టీ నుంచి ఇంకా వెళ్లిపోతున్నారనడం సరికాదని, చంద్రబాబు ఇంకా తమ ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆసక్తిర వ్యాఖ్య చేశారు. ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరడం అనైతికం, చట్ట విరుద్ధం అన్నారు. మా పార్టీ తరఫున గెలిచిన వారిని మేం ఆపేందుకు వారిని కొనాలా అని మండిపడ్డారు.
బుద్ధి, జ్ఞానం ఉన్న వారు ఎవరైనా అలా చేస్తారా అన్నారు. రూ.30, రూ.40 కోట్లు పెట్టి తమ పార్టీ ఎమ్మెల్యేలకు పచ్చ కండువా కప్పుతారా అని ప్రశ్నించారు. సిగ్గు లేని సీఎం దేశంలో ఎవరైనా ఉన్నారా అంటే అది చంద్రబాబు అన్నారు. ఎప్పటికైనా ప్రజాస్వామ్యం నిలబడుతుందన్నారు.
పవన్ కళ్యాణ్ కూడా
పవన్ కళ్యాణ్, లెఫ్ట్ పార్టీ నేతలు కూడా పార్టీ ఫిరాయింపులను తప్పు పట్టారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనుకున్న పవన్ కళ్యాణే ఫిరాయింపులను ప్రశ్నించినా.. తమ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకోవటం చూస్తుంటే ఆయనకు సిగ్గులేనట్లుగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications