వంద తప్పులు, అరెస్ట్ భయం పట్టుకుంది: చంద్రబాబుపై అంబటి
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి వంద తప్పులు చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. ఆయన మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు అరెస్ట్ భయం పట్టుకుందని అన్నారు.
రెండు తెలుగు రాష్ర్టాల మధ్య చిచ్చు పెట్టాలని టిడిపి ప్రయత్నిస్తోందని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఏడాది తర్వాత చంద్రబాబుకు సెక్షన్-8 గుర్తుకొచ్చిందా? అని ప్రశ్నించారు. ఏపీ సెక్రటేరియట్ వద్ద ఏపీ పోలీసులతో భద్రత ఏర్పాటు చేసుకోవడం సరికాదన్నారు. అరెస్ట్ చేస్తారేమోననే చంద్రబాబు భయపడుతున్నారని అన్నారు.
సెక్రటేరియట్ వద్ద చంద్రబాబును అరెస్టు చేసేందుకు తెలంగాణ పోలీసులు వస్తే ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదం రేపుతారా? రెండు రాష్ర్టాల ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని కుట్ర చేస్తున్నారా? అని మండిపడ్డారు. నేరస్తున్ని కాపాడటానికి ఏపీ పోలీసులు ప్రయత్నించొద్దని విజ్ఞప్తి చేశారు.

అలా చేస్తే భారత రాజ్యాంగానికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. చంద్రబాబు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి తప్ప వేరే మార్గం లేదన్నారు. మీ పదవిని కాపాడుకోవడం కోసం రాజ్యాంగంతో ఆడుకోవద్దని చంద్రబాబుకు సూచించారు. ప్రజలు, అధికారులు, ప్రాంతాల మధ్య చిచ్చు రేపుతారా? అని మండిపడ్డారు.
అవినీతి ఆరోపణలు వచ్చినా కూడా పదవిని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారని నిలదీశారు. నోటీసులు ఇస్తే తీసుకోండి, విచారణకు సహకరించండని చంద్రబాబును కోరారు. చంద్రబాబు మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పొడద్దని హితవు పలికారు.
తెలంగాణ సర్కారు నోటీసులు ఇస్తే మేం కూడా ఇస్తామనే బెదిరింపు దోరణితో పోవడం సరికాదని ఏపి మంత్రులకు సూచించారు. చంద్రబాబు విచారణకు సహకరించక పోతే అనేక అనర్థాలకు దారి తీస్తుందని హెచ్చరించారు.
చంద్రబాబును అరెస్టు చేస్తే ఆంధ్రుల ఆత్మగౌరవం పోతుందని అనడం సరికాదన్నారు. ‘మిమ్మల్ని అరెస్టు చేస్తే ఆంధ్రుల గౌరవం పోతుందని అంటున్నారు కదా, మీరు తప్పు చేస్తే ఆంధ్రులు తప్పు చేసినట్టేనా' అని అంబటి ప్రశ్నించారు. ఆంధ్ర నుంచి దోచుకు పోయిన డబ్బును తెలంగాణలో కుమ్మరిస్తూ అక్రమ రాజకీయాలకు పాల్పడుతున్నారని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications