Ambati Rambabu: అంబటికి పోలీసుల షాక్..! అరెస్టుకు రెడీ అంటూ..!
ఏపీలో తిరుమల లడ్డూకు వాడిన నెయ్యి కల్తీపై సిట్ నివేదిక రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. నెయ్యిలో జంతుకొవ్వు కలవలేదని సిట్ నివేదిక తేల్చడంతో వైసీపీ నేతలు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో వారిని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు రంగంలోకి దిగుతున్నారు. రెండు రోజులుగా వైసీపీ నేతల్ని ఎక్కడికక్కడ టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. ఇవాళ కూడా వైసీపీ నేత అంబటిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలతో పాటు సీఎం చంద్రబాబుపైనా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో పోలీసులు అంబటికి షాకిచ్చారు.
తిరుమల నెయ్యి కల్తీపై గుంటూరులోని గోరంట్లలో టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ తాజా వివాదానికి కారణమైంది. ఈ ఫ్లెక్సీ తొలగించాలని నిన్న డిమాండ్ చేసిన అంబటి రాంబాబు (ambati rambabu).. ఇవాళ గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఫ్లెక్సీ తొలగిస్తామని ప్రకటించారు. వైసీపీ నేతలు వస్తారనే సమాచారంతో ఫ్లెక్సీ వద్దకు టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. కర్రలతో అంబటి రాంబాబు కారు వద్దకు వెళ్ళటానికి టీడీపీ నేతలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని వెనక్కి పంపుతున్న క్రమంలోనే కారులోనే ఉన్న అంబటి .. చంద్రబాబుపైనా, టీడీపీ నేతలపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దీంతో ఆయనపై గుంటూరు నల్లపాడు పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదుచేయడం, వారు కేసు నమోదు చేయడం జరిగిపోయాయి. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన అంబటిని అరెస్టు చేయాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు డిమాండ్లు చేస్తున్నారు. మరోవైపు అంబటి దీనిపై స్పందించారు. చట్టవ్యతిరేకంగా మాజీ సీఎం ఫ్లెక్సీని ఏర్పాటు చేశారని, ఆ ఫ్లెక్సీని చించడానికి తాను వెళ్లలేదని తెలిపారు. తనను తిట్టారని, తాను చంద్రబాబును బూతులు తిట్టలేదని పేర్కొన్నారు. తనను తిట్టినవారినే తిట్టానన్నారు. అయితే ఈ వయస్సులో తాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందన్నారు. చంద్రబాబు నుంచి ఆదేశం వచ్చింది, తనను అరెస్ట్ చేస్తారని తెలిపారు. ఆ విషయం తనకూ తెలుసని, అయినా ఐ డోంట్ కేర్ అన్నారు. అరెస్ట్ చేస్తారా... చేసుకోండి, సిద్ధంగా ఉన్నానని అంబటి రాంబాబు ప్రకటించారు.












Click it and Unblock the Notifications