అంబటిపై లంచం ఆరోపణలు-జనసేన వద్దకు బాధితులు-శవాలపై పేలాలు ఏరుకోనన్న మంత్రి
ఏపీలో వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన సొంత నియోజకవర్గం సత్తెనపల్లిలో ఓ మహిళ నుంచి తన కుమారుడి మృతికి వచ్చిన పరిహారంలో వాటా ఇవ్వాలని అంబటి కోరినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిపై విపక్ష జనసేనను బాధితురాలు ఆశ్రయించడంతో వివాదం ముదిరింది. దీనిపై మంత్రి అంబటి క్లారిటీ ఇచ్చారు. జనసేన నేతల ఆరోపణలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు.

అంబటిపై లంచం ఆరోపణలు
రెండు రోజుల క్రితం సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాళ్లలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబుపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. స్ధానికంగా ఉన్న ఓ రెస్టారెంట్ సెప్టిక్ ట్యాంక్ ప్రమాదంలో చనిపోయిన కుమారుడికి 5 లక్షల పరిహారం వస్తే ఆమె నుంచి సగం డబ్బులు పరిహారం ఇప్పిస్తామంటూ అంబటి ఆరోపించినట్లు బాధిత మహిళ ఆరోపించింది. ఈ ఆరోపణల్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూ అంబటిని టార్గెట్ చేశారు. దీంతో ఈ వ్యవహారం కలకలం రేపింది.

అంబటిపై విపక్షాల ఫైర్
సెప్టిక్ ట్యాంక్ లో పడి చనిపోయిన వ్యక్తికి ప్రభుత్వం ఇచ్చిన పరిహారంలో వాటా కోరిన ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి అంబటి రాంబాబుపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ఈ వ్యవహారంపై పత్రికల్లో వచ్చిన కథనాన్ని ట్వీట్ చేస్తూ ఛీ మీరు పాలకులా అంటూ చంద్రబాబు అంబటిపై వ్యాఖ్యానించారు. అలాగే జనసేన నేతలు కూడా బాధిత మహిళను తమ ఆఫీసుకు పిలిచి ఆమెతో మాట్లాడించి అంబటిని టార్గెట్ చేశారు. అంబటి బాధితుల నుంచి లంచం డిమాండ్ చేయడాన్ని వారు తప్పుబట్టారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది.

ఆరోపణలు తోసిపుచ్చిన అంబటి
రైతుల ఆత్మహత్యల పరిహారంలో డబ్బులు తీసుకున్నానని సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాళ్ళ వచ్చి నాపై ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్ ను, నిరూపించమని నేను సవాల్ విసిరితే అది చేతకాక పారిపోయి, ఈరోజు రైతులకు సంబంధం లేని వేరే ఘటనను తెరపైక తీసుకొచ్చి నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, సత్తెనపల్లి నియోజకవర్గంలో మొత్తం 12 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. వారికి ఒక్కొక్క కుటుంబానికి రూ.7 లక్షలు చొప్పున మొత్తం రూ. 84 లక్షలను ప్రభుత్వం పరిహారంగా చెల్లించింది. ఇందులో ఒక్క రూపాయి కూడా అవినీతికి తావు లేదు. చేతనైతే నిరూపించు అని మరోసారి పవన్ కల్యాణ్ కు సవాల్ విసురుతున్నానన్నారు. దానికి సమాధానం చెప్పలేక, సత్తెనపల్లిలో ఒక ప్రైవేటు వ్యక్తికి చెందిన సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ ఘటనలో మరణించిన ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన పంచాయితీని దీనికి ముడిపెట్టి ఆరోపణలు చేయడం తగదని మంత్రి అంబటి హెచ్చరించారు.

శవాలపై పేలాలు ఏరుకునే ఖర్మ లేదన్న అంబటి
జనసేన కోసం సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రాణాలు అర్పించిన యువకుడు మట్టం అశోక్ కుటుంబాన్ని ఆదుకుంటామని మాట ఇచ్చి,, ఇక్కడకు వచ్చి కూడా కనీసం పలకరించలేని, మృతుడు తండ్రి పరిహారం కోసం వస్తే.. గెంటేసిన పవన్ కల్యాణ్ .. తనపై ఆరోపణలు చేయడం సిగ్గు చేటని మంత్రి అంబటి విమర్శించారు.
పవన్ కల్యాణ్ లా పార్టీ పెట్టి, దానిని చంద్రబాబు పాదాల వద్ద తాకట్టు పెట్టి, అందుకు ప్యాకేజీగా క్యాష్ తీసుకునే సన్నాసి రాజకీయాలు నేను జన్మలో చేయను అంటూ అంబటి విరుచుకుపడ్డారు. శవాల మీద పేలాలు ఏరుకోవాల్సిన ఖర్మగానీ, రైతుల ఆత్మహత్యల పరిహారాన్ని తీసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితిగానీ తనకు పట్టలేదని, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల దగ్గర నుంచి నేను రూ. 2 లక్షలు రూపాయలు తీసుకున్నానని నిరూపిస్తే.. నా పదవిని తృణప్రాయంగా వదులుకోవడానికి ఇప్పటికీ సిద్ధంగా ఉన్నానని మంత్రి అంబటి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications