Ambati Rambabu: అంబటికి మరో బిగ్ షాక్..! జైలు నుంచి బయటికొచ్చే లోపే..!
ఏపీలో అధికార కూటమి, విపక్ష వైఎస్సార్సీపీ మధ్య లడ్డూ నెయ్యి కల్తీ విషయంలో సాగుతున్న పోరులో సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసి జైలుపాలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు(ambati Rambabu)కు ఇవాళ ఓ భారీ ఊరట దక్కింది. అయితే ఆ లోపే పోలీసులు ఆయనకు మరో షాకిచ్చారు. చంద్రబాబుపై వ్యాఖ్యల కేసులో రాష్ట్రవ్యాప్తంగా 36 కేసులు నమోదు కాగా.. ఇందులో గుంటూరులోని నల్లపాడు పోలీసులు పెట్టిన కేసులో ఆయన్ను కోర్టు రిమాండ్ కు పంపింది. మిగతాకేసుల్ని హైకోర్టు తోసిపుచ్చింది.
దీంతో అంబటి రాంబాబు విడుదల అవుతారని భావిస్తున్న సమయంలో పోలీసులు మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన కేసు పెట్టి ఆయన్ను జైల్లోనే ఉండేలా చేశారు. అనంతరం ఈ కేసులోనూ ఇవాళ అంబటికి బెయిల్ లభించింది. దీంతో ఆయన రేపటి కల్లా జైలు నుంచి విడుదలవుతారని అంతా భావించారు. ఆలోపే ఆయన నియోజకవర్గం సత్తెనపల్లి పోలీసులు అంబటికి షాకిచ్చారు.

2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో అంబటి రాంబాబు వసూళ్లకు పాల్పడినట్లు అందిన ఫిర్యాదులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అందులో విచారణకు అనుమతించాలని కోరుతూ గుంటూరు కోర్టులో పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు కూడా అందుకు అనుమతించి పీటీ వారెంట్ ను జారీ చేసింది. దీంతో ఈ కేసులో సత్తెనపల్లి పోలీసులు రేపు రాజమండ్రి జైలు నుంచి అంబటిని తమ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. 2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా నిర్వహించిన అంబటి రాంబాబు వసూళ్లకు పాల్పడినట్లు జనసేన నేతలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో వారు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు అదే ఏడాది కేసు నమోదైంది. దీనిపై దర్యాప్తు పేరుతో ఇప్పుడు అంబటిని కస్టడీలోకి తీసుకోబోతున్నారు.












Click it and Unblock the Notifications