టిడిపి వైపు ఆనం బ్రదర్స్ చూపు: కాంగ్రెస్‌పై అసంతృప్తి, చంద్రబాబుపై ప్రశంసలు
నెల్లూరు: జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేతలైన ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి సోదరులు తెలుగుదేశం పార్టీవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టిడిపి నేతలతో ఆనం సోదరులు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. జిల్లాలో అడ్రస్ లేని నేతలను ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ హైకమాండ్‌పై ఆనం సోదరులు అసహనంగా ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే టిడిపిలోకి వెళ్లే ఆలోచనలో ఆనం సోదరులున్నారని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మట్టి సత్యాగ్రహం వల్ల ఉపయోగం ఏంటని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం ప్రశ్నించారు.
నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. తాము రాజకీయాలు వదులుకోలేమని అన్నారు. తాను రాజకీయ జీవితం ప్రారంభించినది మాత్రం టిడిపి నుంచి అని ఆయన చెప్పారు. 1991లో కాంగ్రెస్లో చేరానని ఆయన అన్నారు. తన రాజకీయ పరిచయాలు, కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుని భవిష్యత్ రాజకీయాలపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రస్తుతం ప్రజాసేవ చేసేందుకు కాంగ్రెస్ అనుకూలంగా లేదని అన్నారు.
పిసిసి చీఫ్ రఘువీరా రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తు తరాలకు నష్టం కలిగే నిర్ణయాన్ని తీసుకోవడం వల్ల రాష్ట్ర ప్రజలు తమకు తగిన బుద్ధి చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లభించడం కష్టమని ఆయన చెప్పారు. పార్టీ చేపట్టే కార్యక్రమాల వల్ల పార్టీకి ఉపయోగం ఉండాలని, లేని పక్షంలో ఆ కార్యక్రమాలు చేపట్టడం ఎందుకని ఆయన ప్రశ్నించారు.

ప్రజలకు అవసరమైన పనులు, వాటి సాధనకై చేపట్టాల్సిన నిరసనలు, ఉద్యమాలు చేయడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. మట్టి సత్యాగ్రహాలతో సాధించేది ఏదీలేదని, ప్రజలను చైతన్యం చేసే దిశగా కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందన్నారు. నిరసనలతో నాయకులు అలసిపోతున్నారు కానీ, ప్రజల నుంచి స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు.
దశాబ్దాల తరబడి ఆనం కుటుంబం ప్రజాసేవే లక్ష్యంగా పని చేస్తూ రాజకీయాల్లో జీవనం సాగిస్తున్నదని, కాబట్టి ప్రజల ఆమోదం పొందగలిగిన పార్టీలతో కలిసి పని చేస్తామని చెప్పారు. ప్రజలకు సేవ చేయగలిగే అవకాశం ఎక్కడుందో కాలమే నిర్ణయిస్తుందని ఓ ప్రశ్నకు సమాధానంగా అన్నారు.
తమ రాజకీయ దిశానిర్ధేశానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి ఆలోచనలతో ముందుకెళుతున్నారని ప్రశంసించారు. అయితే ప్రస్తుతం ఆయనపై ఒత్తిడి ఎక్కువగా ఉందన్నారు. రాజకీయాల్లో సందర్భోచితంగా పాలకపక్షాన్ని విమర్శించవచ్చుకానీ పనిగట్టుకుని విమర్శలు చేయడం సరికాదని సూచించారు.












Click it and Unblock the Notifications