కాంగ్రెస్ అధిష్టానంపై దుమ్మెత్తి పోసిన మాజీ మంత్రి ఆనం
నెల్లూరు: కాంగ్రెసు పార్టీ అధిష్టానంపై మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దుమ్మెత్తిపోశారు. తన సోదరుడు ఆనం వివేకానంద రెడ్డితో పాటు తాను కాంగ్రెసుకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాంగ్రెసు అధిష్టానంపై ఆయన విమర్శలు చేశారు.
కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ నాయకులకు విలువ లేకుండా చేసిందని ఆయన శనివారం మీడియాతో అన్నారు. 18 నెలలుగా కాంగ్రెసు ఏం చేసినా ప్రజలు నమ్మలేదని ఆయన అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నామని ఆయన చెప్పారు.

గతంలో కూడా తాము ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలో పనిచేశామని ఆయన గుర్తు చేశారు. నెల్లూరు టిడిపి నాయకులు కూడా తమను ఆహ్వానిస్తున్నారని చెప్పారు. డిసెంబర్ 13వ తేదీన లేదా చైతన్య యాత్రల సందర్భంగా తాము టిడిపిలో చేరుతామని ఆయన చెప్పారు.
గత కొంత కాలంగా ఆనం సోదరులు టిడిపిలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ తాము టిడిపిలో చేరుతున్నట్లు ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారంనాడే ప్రకటించారు.












Click it and Unblock the Notifications