వినుకొండ.. ఎవరికి అండ?
Vinukonda Assembly round up: ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆసక్తికర పోరు నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య హోరాహోరిగా పోరాడే అవకాశాలు ఉన్న నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి.
నరసరావుపేట లోక్‌సభ పరిధిలోకి వచ్చే జనరల్ సీటు ఇది. 2,51,677 మంది ఓటర్లు ఉన్నారు. కమ్మ, కాపు బీసీ సామాజిక వర్గం ఓటుబ్యాంకు అధిక సంఖ్యలో ఉంటుందీ నియోజకవర్గం పరిధిలో. ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా.. అత్యధికంగా నాలుగుసార్లు కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గాన్ని గెలుచుకుంది.

టీడీపీ, సీపీఐ మూడుసార్లు చొప్పున ఇక్కడ విజయం సాధించాయి. రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థులు గెలుపుబావుటా ఎగరేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా కైవసం చేసుకున్న స్థానం ఇది. 1983లో తెలుగుదేశం ఆవిర్భవించిన తరువాత వినుకొండలో గెలవడానికి పదేళ్లు పట్టింది. 1999లో తొలిసారిగా ఇక్కడ పసుపు జెండా ఎగిరింది. టీడీపీ తరఫున వీరపనేని యలమందరావు గెలిచారు.
2004లో మళ్లీ ఈ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మక్కెన మల్లికార్జున రావు విజయం సాధించారు. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు వరుసగా రెండుసార్లు ఇక్కడ జెండా పాతారు. 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. హ్యాట్రిక్ కొట్టాలన్న కలలు కల్లలయ్యాయి.
ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు భారీ మెజారిటీతో ఈ స్థానాన్ని దక్కించుకున్నారు. జీవీ ఆంజనేయులును 28,859 ఓట్ల తేడాతో మట్టికరిపించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ మరోసారి జీవీ ఆంజనేయులునే నమ్ముకుంది. ఆయనకే టికెట్ కేటాయించింది. వైసీపీ ఇప్పటివరకు ఇక్కడ కొత్తగా ఎవరినీ అభ్యర్థిగా ప్రకటించలేదు. బొల్లా బ్రహ్మనాయుడే పోటీ చేస్తారనే అంచనాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications