కృష్ణయ్య టు పవన్ కళ్యాణ్: చంద్రబాబు కార్నర్, కక్కలేక 'కాపు' టిడిపి
విజయవాడ: కాపు రిజర్వేషన్ల పైన హామీ, ముద్రగడ పద్మనాభం దీక్ష నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన ముప్పేట దాడి చేస్తున్నారు. విపక్షం నుంచి స్వపక్షం వరకు ముద్రగడ దీక్షకు మద్దతు పలుకుతుండటం గమనార్హం.
కాపులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని, రిజర్వేషన్లు కల్పించాలని ముద్రగడ పద్మనాభం కిర్లంపూడిలోని తన నివాసంలో సతీమణితో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దీనిపై కాపుల నుంచి ఆయనకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. నేతలు సంఘీభావం తెలుపుతున్నారు.
ముద్రగడ దీక్షకు ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు భేషరతు మద్దతు పలుకుతున్నాయి. దీనిపై బిజెపి స్పందించకపోయినప్పటికీ ఆ పార్టీ నేతలు మాత్రం మద్దతిస్తున్నారు. కాపు గర్జన నేపథ్యంలో బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ పైన కూడా కేసు నమోదయింది.

మరోవైపు, తెలుగుదేశం పార్టీకి చెందిన కాపు నేతలు ఆయనకు మద్దతుగానే మాట్లాడుతున్నారు. ముద్రగడ దీక్షలో న్యాయం ఉందని, అయితే అనగానే నెరవేర్చడం కాదని, సమయం ఇవ్వాలని కోరుతున్నారు. ముద్రగడ దీక్షకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఆయన కాపు హీరో అయిపోయారు.
కక్కలేక మింగలేక కాపు టిడిపి నేతలు
ఈ నేపథ్యంలో పలువురు కాపు టిడిపి నేతల పరిస్థితి కక్కలేక మింగలేక అన్న చందంగా ఉందని అంటున్నారు. దీక్షకు పూర్తిగా మద్దతుగా మాట్లాడలేక, ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించలేక ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. టిడిపి కాపు నేతలను వైసిపి ప్రధానంగా లక్ష్యంగా చేసుకుంది.
టిడిపిలోని కాపు నేతలు తమ కులానికి అన్యాయం చేయవద్దని, సమస్యను పరిష్కరించేందుకు వారు కృషి చేయాలని, అలాగని కాపులకు అన్యాయం చేయవద్దని, కాపులకు ఇచ్చిన హామీని చంద్రబాబు నెరవేర్చేలా చూడాలని హితవు పలుకుతున్నారు. చంద్రబాబు ఇచ్చిన కాపు రిజర్వేషన్ల హామీపై వైసిపి ప్రధానంగా ఆయనను లక్ష్యంగా చేసుకొని సాధ్యమైనంత ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తోంది.
స్వపక్షం నుంచే హెచ్చరిక
మరోవైపు, కాపులను బీసీలలో చేర్చితే ఊరుకునేది లేదని బీసీ నేత ఆర్ కృష్ణయ్య ఏపీ సీఎం చంద్రబాబును హెచ్చరిస్తున్నారు. చంద్రబాబుకు సొంత పార్టీ నేతల నుంచే హెచ్చరికలు వస్తుండటం గమనార్హం. ఆర్ కృష్ణయ్య తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే. సార్వత్రిక ఎన్నికలకు ముందు టిడిపికి మద్దతుగా నిలిచిన మందకృష్ణ మాదిగ కూడా బీసీలకు రిజర్వేషన్లు అన్న చంద్రబాబును తప్పుబడుతున్నారు.
కాపుల రిజర్వేషన్ల కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి మూడు రోజుల క్రితం చంద్రబాబుకు ఘాటుగా లేఖ రాశారు. చివరకు.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుకు అండగా నిలబడిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా... కాపులకు ఇచ్చిన హామీని తప్పారని విమర్శించారు.












Click it and Unblock the Notifications