ఏపీలో అంచనాలకు మించి..!!
Temperature in Andhra Pradesh: ఏపీలో ఎండ తీవ్రత అంచనాలకు మించి పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రత రికార్డు స్థాయికి చేరుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే చోటు చేసుకుంటోన్న విద్యుత్ కోతలు దీనికి తోడవుతోన్నాయి. ఫలితంగా ఉక్కపోతకు గురి అవుతున్నారు జనం.
ఈ నెల మొదటి వారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలు పగటి ఉష్ణోగ్రత చుక్కలు చూపిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. నడి వేసవి నాటి వాతావరణాన్ని తలపిస్తోంది. ఫిబ్రవరి తొలి అర్ధభాగంలోనే రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రత 35 డిగ్రీలుగా నమోదైంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా కనిపించింది.

మార్చి మొదటివారంలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా ఉండే అవకాశం ఉందని విశాఖపట్నంలోని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఏప్రిల్- మే నెలల్లో పగటి ఉష్ణోగ్రత గరిష్ఠంగా 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉండే అవకాశాలు లేకపోలేదు.
పొడి వాతావరణం కారణంగా ఎండ తీవ్రత అధికంగా ఉంటోందని విశాఖపట్నంలోని భారత వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. బంగాళాఖాతం మీదుగా వీస్తోన్న వేడి గాలుల వల్ల పొడి వాతావరణం నెలకొంటోంది. మున్ముందు ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని, మార్చి మొదటివారంలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరువ కావొచ్చని అంచనావేసింది.
వాతావరణ మార్పు ప్రభావం సైతం దీనికి తోడైనట్లు చెబుతున్నారు. అటవీ విస్తీర్ణం ఆందోళనకరంగా తగ్గిపోతోండటం, పట్టణీకరణ శరవేగంగా కొనసాగుతోండటం, గ్రీన్‌హౌస్, వాయు ఉద్గారాలు వంటి అంశాలు.. వేడిగాలుల ప్రభావాన్ని తీవ్రతరం చేస్తోన్నాయంటూ వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తోన్నారు.
దీనికి అనుగుణంగా రాయలసీమ జిల్లాల్లో వేడి తీవ్రత రోజురోజుకూ అధికమౌతూ వస్తోంది. అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో నమోదవుతున్న పగటి ఉష్ణోగ్రత 36 డిగ్రీలు పైమాటే. ఆదోని, మంత్రాలయం, పత్తికొండ.. నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో ఉష్ణోగ్రత అధికంగా ఉంటోంది.












Click it and Unblock the Notifications