ప్రభుత్వంతో చర్చలు సఫలం..సమ్మె విరమించిన ఏపీ అంగన్వాడీలు
అమరావతి: ఏపీలో గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు ఎట్టకేలకు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు .ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని అంగన్‌వాడీల ప్రతినిధులు తెలిపారు. జులైలో వేతనాలు పెంచుతామని ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిందని.. మంగళవారం నుంచి విధుల్లోకి వెళ్తామని చెప్పారు.
జనవరి 24న ఏపీ బంద్‌కు అంగన్‌వాడీలు పిలుపునివ్వడంతో ఏపీ సర్కారు మరోసారి వారిని చర్చలకు పిలిచింది. మంత్రి బొత్స సత్యనారాయణ ఆ సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలు, సమస్యలను వారు మంత్రి దృష్టికి తెచ్చారు. యథావిధిగా విధులకు హాజరుకావాలని అంగన్‌వాడీ సంఘాలకు మంత్రి బొత్స విజ్ఞప్తి చేశారు. చాలా జిల్లాల్లో అంగన్‌వాడీలు విధులకు హాజరవుతున్నారని.. మిగితా సిబ్బంది కూడా విధుల్లో చేరాలని కోరారు.

అంగన్‌వాడీల ఆందోళన సమయంలో అనేక డిమాండ్లను అంగీకరించామని తెలిపిన మంత్రి బొత్స సత్యనారాయణ.. మిగిలిన వాటిపట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. అంగన్‌వాడీలు తమ ముందు 11 డిమాండ్లు పెట్టారని, వాటిలో పదింటిని నెరవేర్చేందుకు అంగీకరించామని తెలిపారు. వేతనాలు పెంచాలనే డిమాండ్ ను జూన్ నెలలో నెరవేరుస్తామని చెప్పినట్లు మంత్రి బొత్స వెల్లడించారు. దీంతో సమ్మె విరమణకు అంగన్‌వాడీలు అంగీకరించారని తెలిపారు.
అంగన్‌వాడీ టీచర్ రిటైర్మెంట్ బెనిఫిట్ ను రూ. 1.20 లక్షలకు పెంచామని చెప్పారు. హెల్పర్స్ కు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ. 60 వేలకు పెంచామని వివరించారు. ఉద్యోగ పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు నిర్ణయం తీసుకున్నామని, మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి అంగన్‌వాడీలుగా మారుస్తామని మంత్రి తెలిపారు. చనిపోయిన అంగన్‌వాడీల మట్టిఖర్చుల కోసం రూ. 20 వేలు ఇస్తామన్నారు.
రెండు దఫాలు అంగన్‌వాడీలతో చర్చలు జరిగాయని.. వారిపై నమోదైన కేసులను సీఎంతో చర్చించి ఎత్తివేస్తామని మంత్రి బొత్స తెలిపారు. సమ్మె కాలంపై ఏం చేయాలో సీఎంతో చర్చిస్తామన్నారు. సమ్మె విరమిస్తామని చెప్పినందుకు మంత్రి బొత్స సత్యనారాయణ అంగన్వాడీలకు కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications