ఏపీలో కొత్త ఫ్రంట్ -చంద్రబాబు మాస్టర్ ప్లాన్ : జగన్ చిక్కుతారా!!
టీడీపీ అధినేత-ప్రతిపక్ష నేత చంద్రబాబు కరోనా దెబ్బకు హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన బయటకు రావటానికి భయడుతున్నారు. ఇదీ..రోజూ వైసీపీ నేతలు చేసే విమర్శ. కానీ, చంద్రబాబుకు ఇప్పడు ఏపీ లో తిరిగి అధికారంలోకి రావటం..పార్టీకి తిరుగులేకుండా చేసుకోవటం. ఈ రెండు ఇప్పుడు ఏపీలో జగన్ బలం ముందు అంత సులువైన అంశాలు కావు. కానీ, చంద్రబాబు కామ్ గా ఉండటం లేదు. తెర వెనుక వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఏపీలో జగన్ బలం ఏంటనేది అందరి కంటే చంద్రబాబుకే ఎక్కువగా తెలుసు. ఏ వర్గాలు జగన్ కు దగ్గర అయ్యాయి...ఎవరిని తన వైపు తిపుకోవచ్చనేది బాగా తెలిసిన నేత.

టార్గెట్ -2024 పేరుతో యాక్షన్ ప్లాన్..
దీంతో..టార్గెట్ -2024 పేరుతో కొత్త యాక్షన్ ప్లాన్ రెఢీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ముందుగా..జగన్ కు మద్దతుగా ఉన్న బీజేపీ కి తాను దగ్గరై..జగన్ ను దూరం చేయటం. అందు కోసం ఢిల్లీ కేంద్రంగా అడుగులు వేస్తున్నారు. ఈ విషయాన్ని బీజేపీ నేతలు సైతం అంతర్గత సమావేశాల్లో అంగీకరిస్తున్నారు. కానీ, ప్రధాని మాత్రం టీడీపీతో కలవటానికి సుముఖంగా లేరని సమాచారం. అయితే, కాంగ్రెస్ తో సత్సంబంధాలు నడిపిన చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు.

పార్టీలకు ఏకం చేసి..జగన్ లక్ష్యంగా..
మోదీ వ్యతిరేకత మొదలైతే.. చంద్రబాబుకు అడగకుండానే ప్రాధాన్యత దక్కుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక, రాష్ట్రంలోనూ కొత్త ఫ్రంట్ దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలను ఏకం చేయటం...కూటములు కట్టటం..ఎన్నికల్లో సీట్ల సర్దుబాట్లు..ఇవన్నీ చంద్రబాబు కు నేషనల్ ఫ్రంట్ సమయం నుంచి చేసిన అనుభవం ఉన్నవే. టీడీపీ ఒంటరిగా పోటీ చేసిప్పుడు ఓడిపోయింది. ఇతర పార్టీలతో జత కట్టినా ఓడిన సందర్భాలు ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఏపీలో జగన్ ను ఓడించాలంటే ఖచ్చితంగా ప్రతిపక్షాలను ఏకంగా చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.

కూటమి రాజకీయాల్లో చంద్రబాబు కింగ్..
అందులో భాగంగానే..తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2009లో వైఎస్సార్ ను ఓడించేందుకు నాడు చంద్రబాబు మహా కూటమి ఏర్పాటు చేసారు. అయినా...వైఎస్సార్ విజయం సాధించారు. దానికి కారణం ప్రజారాజ్యం చీల్చిన ఓట్లు అంటూ టీడీపీ నేతలు ఇప్పటికీ చెబుతారు. అదే విధంగా 2019 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ విడివిడిగా పోటీ చేయటం ద్వారా దాదాపు 30 సీట్లలో జనసేన తమ ఓట్లను చీల్చి..వైసీపీ గెలుపుకు పరోక్షంగా కారణమైందనేది టీడీపీ నేతల మరో విశ్లేషణ.

జగన్ - చంద్రబాబుకు జీవన్మరణ సమస్యగా..
దీంతో..2024 ఎన్నికలు టీడీపీ కి అధికారంలోకి రావటానికి..అదే విధంగా జగన్ కు అధికారం నిలబెట్టుకోవటానికి జీవన్మరణ సమస్యగా మారబోతోంది. దీంతో..చంద్రబాబు తిరిగి జనసేన-వామపక్షాలతో కలిసి కట్టుగా ఫ్రంట్ ముందుగానే ఏర్పడే విధంగా పావులు కదుపుతున్నారని విశ్వసనీయ సమాచారం. తాజాగా.. పవన్ బీజేపీతో పొత్తు ఉన్నా.. టీడీపీ పైన వ్యతిరేకతతో లేరని చెబుతున్నారు. ఆగస్టు 15 ప్రసంగంలో జగన్ ప్రభుత్వం ఒక కులం టార్గెట్ గా వ్యవహరిస్తే..మరొకరు అధికారంలోకి వచ్చినప్పుడు మరో కులం లక్ష్యంగా మారుతుందని వ్యాఖ్యానించటాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

2014 పొత్తులు రిపీట్ అవుతాయా..
బీజేపీతో చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అయితే, 2014 తరహాలో నే తిరిగి బీజేపీ-టీడీపీ-జనసేన ఒక్కటయ్యే అవకాశాలు ఉంటాయి. బీజేపీ ఇక, టీడీపీతో కలిసేది లేదని తేల్చి చెబితే..పవన్ నిర్ణయం కీలకం కానుంది. అదే విధంగా బీజేపీ-జనసేన- టీడీపీ కలిస్తే తెలుగుదేశంకు వామపక్షాలు దూరం అవుతాయి. వామపక్షాల కంటే పవన్ - బీజేపీ తమకు ముఖ్యమనే భావనలో టీడీపీ ఉంది. అయినా..చివరి నిమషం వరకు బీజేపీతో ఘర్షణ లేకుండా... తిరిగి కలిసేందుకే ప్రాధాన్యత ఇస్తోంది.

జగన్ ను ఉక్కిరి బిక్కరి చేయటమే లక్ష్యంగా..
అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ తో మాత్రం దూరంగా ఉండకుంటే టీడీపీకి నష్టమే. దీంతో...జగన్ పైన ఇప్పుడు చంద్రబాబు ప్రత్యక్ష-పరోక్ష ప్రమేయంతో మూకుమ్మడిగా అన్ని వైపుల నుంచి రాజకీయంగా దాడి కొనసాగుతోంది. జగన్ హవా తగ్గిపోయిందనే ప్రచారం మొదలైంది. ఇదంతా టీడీపీ మైండ్ గేమ్ గా వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే, జగన్ ప్రజల్లోకి వచ్చిన సమయం నుంచి కౌంటర్ గేమ్ మొదలవుతుందని ఆ పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు.
దీంతో...టార్గెట్ 2024 పేరుతో చంద్రబాబు ఏపీలో రాజకీయాన్ని పూర్తిగా తిరిగి తన నియంత్రణలోకి తెచ్చుకొనేందుకు చేస్తున్న ప్రయత్నాలు.. దీనిని అడ్డుకొనేందుకు జగన్ అమలు చేసే వ్యూహాలు రానున్న రోజుల్లో ఏపీలో సరి కొత్త సమీకరణాలకు వేదిక కానుంది.












Click it and Unblock the Notifications