DSC అభ్యర్ధులకు అలర్ట్, డీఎస్సీ 2026 షెడ్యూల్ వచ్చేస్తుంది.
ఏపీలో మరోసారి ఉద్యోగాల జాతర ప్రారంభం కాబోతుంది. కొత్త సంవత్సరంలో భారీగా ఉద్యోగాల నియామకానికి కూటమి సర్కార్ సిద్ధమైంది. ఒకేసారి 2,500 పోస్టుల భర్తీకి సమాయత్తమైంది. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో జీవో 117ను రద్దుచేసి కొత్తగా తొమ్మిది రకాల విధానాలు తీసుకొచ్చిన క్రమంలో కొత్తగా విడుదల కాబోయే జాబ్ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణకు సంబంధించిన ప్రక్రియపై కసరత్తు జరుగుతుంది. ఎంతో కాలంగా డీఎస్పీ అభ్యర్ధులు ఎదురుచూస్తున్న నియామక ప్రక్రియకు పాఠశాల విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే, ఫిబ్రవరి తొలి వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారు 2,500 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ ఏడాది పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, అలాగే ఇప్పటికే ఉన్న ఖాళీలను పరిగణనలోకి తీసుకుని నియామకాల ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. ఇక ఇదే విద్యా సంవత్సరంలో జీవో 117ను రద్దు చేసి, కొత్తగా తొమ్మిది రకాల విద్యా విధానాలను అమలులోకి తీసుకువచ్చారు. ఈ విధానాల క్రమంలో 9,200 ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా అప్ గ్రేడ్ చేసి, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించే విధంగా ఏర్పాట్లు చేశారు.

శాశ్వత నియామకాలు..
ఈ మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టింది కూడా. అనంతరం విద్యా శాఖ చేసిన అంచనా ప్రకారం 1,146 మంది ఉపాధ్యాయులు అదనంగా అవసరమని గుర్తించారు. ఆ ఖాళీలను తాత్కాలికంగా భర్తీ చేయడానికి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించారు. ఇప్పుడు ఆ పోస్టులు సహా ఇతర ఖాళీలను కలిపి డీఎస్సీ ద్వారా శాశ్వత నియామకాలు చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రాథమిక లెక్కల ప్రకారం ప్రస్తుతం దాదాపు 2 వేల పోస్టులు ఖాళీగా ఉండగా, తుది అంచనాలో ఆ సంఖ్య 2,500కు చేరే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
డీఎస్సీలో కొత్త పేపర్‌కు ప్రతిపాదన
ఈసారి డీఎస్సీ పరీక్ష విధానంలో మార్పులు చేయాలని విద్యాశాఖ యోచిస్తోంది. ఇప్పటివరకు సంబంధిత సబ్జెక్టుపై మాత్రమే పరీక్ష నిర్వహిస్తుండగా, ఇకపై ఆంగ్ల భాషా ప్రావీణ్యం, కంప్యూటర్ పరిజ్ఞానంపై ప్రత్యేక పేపర్ ప్రవేశపెట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ అంశాలపై ప్రాథమిక అవగాహన ప్రతి ఉపాధ్యాయుడికి అవసరమనే ఉద్దేశంతో, ఈ రెండు అంశాలను కలిపి ఒకే పేపర్‌గా పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై తుది నిర్ణయం త్వరలో వెలువడే అవకాశం ఉంది.
టెట్ ఫలితాలు ముందుగానే?
ఇదిలా ఉండగా, ఇటీవల ముగిసిన టెట్ పరీక్షల ఫలితాలను షెడ్యూల్‌కు ముందే విడుదల చేయాలని విద్యాశాఖ యోచిస్తోంది. అధికారిక షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19న ఫలితాలు ప్రకటించాల్సి ఉన్నా, పరీక్షలు ముందుగానే ముగియడంతో ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేశారు. త్వరలో తుది కీని ప్రకటించి, ఈ నెల 9లోగా టెట్ ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు.












Click it and Unblock the Notifications