ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్: ఇక వారంతా ప్రభుత్వ ఉద్యోగులే!
అమరావతి: కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2014 జూన్ 2 నాటికి ఐదేళ్లు పూర్తయిన కాంట్రెక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం నిర్వహించనున్న కేబినెట్ భేటీలో ఆమోదం తెలపనుంది. ఏపీ సచివాలయంలో మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు సమావేశమయ్యాయి.
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రులు ఆదిమూలపు సురేశ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక శాఖ అధికారులు భేటీ అయ్యారు. ఏపీ రెవెన్యూ, సచివాలయ ఉద్యోగుల సంఘం, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఏపీ ఎన్జీవో ఉపాధ్యాయ సంఘాలకు చెందిన నేతలు భేటీకి హాజరయ్యారు.

12 వేతన సవరణ సంఘంపైనా ఉద్యోగ సంఘాలతో చర్చించారు. కేబినెట్ సమావేశంలోనే దీనిపైన కూడా ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు, పీఆర్సీ ఛైర్మన్‌గా మాజీ సీఎం సమీర్ శర్మ పేరును ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, దీన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
ఇది ఇలావుండగా, మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనని అన్నారు. త్వరలోనే కొత్త పీఆర్సీ కమిటీ నియామకం ఉంటుందని పేర్కొన్నారు.
కొత్త పెన్షన్ విధానంపై కేబినెట్‌లో చర్చించి మెరుగైన విధానం తీసుకొస్తామన్నారు. ఉద్యోగులకు ఖచ్చితంగా పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఉద్యోగాల సంఘాల కోరిక మేరకు నాలుగేళ్లలో 16 వాయిదాల్లో మొత్తం పీఆర్సీ బకాయిలు చెల్లించడానికి అంగీకరించినట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications