ఏపీలో మహిళలకు నెలకు 1500 పథకం ఎప్పుడంటే..! మండలిలో ప్రకటన..!
ఏపీలో కూటమి పార్టీలు గత ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన మహిళలకు నెలకు 1500 ఇచ్చే ఆడబిడ్డ నిధి పథకాన్ని అటకెక్కించేశారన్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ క్లారిటీ ఇచ్చింది. ఈ పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారన్న ప్రశ్నకు సమాధానంగా శాసనమండలిలో మంత్రి దీనిపై స్పష్టత ఇచ్చారు. గతంలో ఈ పథకం పేరుతో వైసీపీ మోసం చేసిందని, అలా జరగకుండా తాము చూస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో 18 నుంచి 50 ఏళ్ల మధ్య అర్హత గల మహిళలకు నెలకు 1500 రూపాయలు అందించడం ఆడబిడ్డ నిధి పథకం ప్రతిపాదన అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శాసన మండలిలో తెలిపారు. ఈ పథకం ఎప్పుడు ఇస్తారని విపక్ష వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ పథకం అమలు కోసం పూర్తిస్దాయిలో పరిశీలన జరుగుతోందని, అంచనాలు వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అవి పూర్తి కాగానే ఇతర పథకాల్లాగే దీన్ని కూడా అమలు చేస్తామన్నారు.

గత ప్రభుత్వం లోటు బడ్జెట్ ఇచ్చినా తల్లికి వందనం, పెన్షన్ పెంపు, స్త్రీశక్తి లాంటి ఎన్నో స్కీమ్స్ అమలు చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి తెలిపారు. ఆడబిడ్డ నిధి పథకంపై విధివిధానాలు ఖరారు చేయాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇతర పథకాల తరహాలోనే ఆడబిడ్డ నిధి పథకం కూడా పూర్తిస్ధాయిలో అధ్యయనం చేసి అమలు చేయాలని అనుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో సుమారు 89 లక్షల మహిళలకు 20 వేల రూపాయలు ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి ఉందన్నారు.

గత వైసీపీ ప్రభుత్వంలో చేయూత పెన్షన్ పేరుతో హామీ ఇచ్చి దాన్ని ఏడాది 75 వేలు ఇవ్వకుండా 25 లక్షల మందికే ఇచ్చారన్నారు. నాలుగేళ్లలో ఇలా 16 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని మంత్రి గుర్తుచేశారు. వాస్తవానికి కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తయిన తర్వాత ఆడబిడ్డ నిధి పథకంపై సీఎం చంద్రబాబును కొన్ని ఇంటర్వ్యూల్లో ప్రశ్నించినప్పుడు దీన్ని పీ4లో కలిపి అమలు చేస్తామని ప్రకటించారు. దీనిపై విమర్శలు రావడంతో తిరిగి ఈ పథకం ఇచ్చే విషయంపై ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications