మాడు పగిలే ఎండలు.. 60 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ గాలులు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భానుడు భగభగలాడుతున్నాడు. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్న చందంగా రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ ఏపీలో ఎండ తీవ్రత మునుపెన్నడూ లేని విధంగా అత్యధికంగా 48 డిగ్రీలు దాటిపోవడంతో జనం అల్లాడిపోయారు. ప్రధానంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అత్యధికంగా 48.14 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి) లో 47.17 డిగ్రీలు, నందివాడ (కృష్ణా) లో 47.1 డిగ్రీలు, చింతలపూడి (ఏలూరు) లో 46.94 డిగ్రీలు, గణపవరం (పశ్చిమ గోదావరి) లో 46.82 డిగ్రీలు, , గోపాలపురం (తూర్పు గోదావరి) లో 46.78 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ తీవ్రమైన ఎండల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది.
ఆశాజనకంగా నైరుతి రుతుపవనాల పయనం.. ఈ రికార్డు స్థాయి ఎండలతో తలమునకలవుతున్న ఏపీ ప్రజలకు అమరావతి వాతావరణ కేంద్రం ఒక చల్లని కబురు అందించింది. తీవ్రమైన ఎండల నుండి త్వరలోనే ఊరట లభించనుంది. మే 23 నాటికే నిర్ణీత అక్షాంశ, రేఖాంశాల గుండా సాగుతున్న నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి పయనం ప్రస్తుతం ఆశాజనకంగా సాగుతోంది. ఇవి ఈ రోజు (మే 24, 2026) నైరుతి అరేబియా సముద్రం, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు కొమరిన్ ప్రాంతం, బంగాళాఖాతంలోని నైరుతి, ఆగ్నేయ, తూర్పు మధ్య ప్రాంతాలు , అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాలలోకి మరింతగా విస్తరించాయి. రాగల 2 నుండి 3 రోజుల్లో ఇవి మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.

మరోవైపు, దక్షిణ బీహార్ నుండి జార్ఖండ్, ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ఉత్తర-దక్షిణ ద్రోణి విస్తరించి ఉంది. దీనితో పాటు, నైరుతి బంగాళాఖాతం , దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ వాతావరణ మార్పుల ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మారనుంది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:
ఈరోజు, రేపు , ఎల్లుండి ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచవచ్చు. అయితే, వర్షాలు కురిసే ముందు వరకు వాతావరణం వేడిగా, తేమతో కూడి అసౌకర్యంగా ఉంటుంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:
ఈ ప్రాంతంలోనూ రాగల మూడు రోజుల పాటు ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే వీలుంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఉరుములు, మెరుపులు సంభవించవచ్చు.
రాయలసీమ:
రాయలసీమ పరిధిలో ఈరోజు కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. ఈరోజు గరిష్టంగా గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో అత్యంత బలమైన గాలులు వీచే అవకాశముంది. రేపు, ఎల్లుండి కూడా వర్షాలు కొనసాగుతాయి, అయితే గాలుల వేగం గంటకు 40-50 కిలోమీటర్లుగా ఉంటుంది.
ప్రస్తుతం భానుడి సెగలతో రాష్ట్రం అట్టుడుకుతున్నప్పటికీ, వాతావరణ కేంద్రం డైరెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రుతుపవనాల కదలికలు , ద్రోణి ప్రభావం వల్ల కోస్తా ఆంధ్రప్రదేశ్ , యానాంలో మూడవ రోజు నుండి గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడతాయని, ప్రజలకు ఎండల నుండి ఉపశమనం లభిస్తుందని స్పష్టమవుతోంది.














Click it and Unblock the Notifications