నేటి నుంచి.. తిరుమల శ్రీవారి ఆలయంలోని పవిత్ర మండపంలో.. !!
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 78,057 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 33,406 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.15 కోట్ల రూపాయల కానుకలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. ఆ ఒక్క రోజే 4.09 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. అలాగే 4.09 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
కాగా శ్రీవారి ఆలయంలో ఈ నెల నేటి నుంచి 25వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు శనివారం నాడు శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు టీటీడీ అర్చకులు. సాయంత్రం శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనులవారు ఆలయ మాడవీధుల గుండా ఊరేగింపుగా వసంతమండపానికి వేంచేపు చేశారు. అనంతరం మృత్సంగ్రహణం, ఆస్థాన వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయంలోని పవిత్ర మండపంలో అంకురార్పణ వైదిక కార్యక్రమాలు చేపట్టారు. శ్రీవారి ఆలయంలో 25వ తేదీ వరకు ఈ పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. అంకురార్పణ కారణంగా శనివారం సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల గానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి. 1962వ సంవత్సరం నుంచి టీటీడీ ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. ఈ ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు అర్చకులు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇస్తారు.
నేడు పవిత్రాల ప్రతిష్ట, 24న పవిత్ర సమర్పణ, 25న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. నేటి నుంచి 25వ తేది వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకారం, 25న అష్టదళ పాదపద్మారాధన సేవ, 26న.. అంటే పవిత్రోత్సవాలు ముగిసిన తర్వాత రోజు కల్యాణోత్సవ సేవలను రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది.














Click it and Unblock the Notifications