CJP: అభిజిత్ దిప్కేపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఎందుకంటే..?
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కేపై మహారాష్ట్రలోని లాటుర్ జిల్లాలో కేసు నమోదైంది. ఓ పాఠశాలలోకి అక్రమంగా ప్రవేశించి.. టీచర్లకు బెదిరింపులు ఇచ్చినందుకు గానూ ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లాటుర్ జిల్లాలోని ఔసా పోలీస్ స్టేషన్ లో జిల్లా పరిషత్ ఉర్దూ టీచర్ సయ్యద్ శంశద్ బానో ఖైరత్ అలీ(53) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. లాటూర్ జిల్లావ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన స్కూల్ ఠీక్ ఖరో కార్యక్రమంలో భాగంగా దిప్కే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోకి ప్రవేశిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు.
ఔసాలోని జెడ్ పీ ఉర్దూ పాఠశాల యాజమాన్యం ఈ మేరకు అభిజిత్ దిప్కే చర్యలను తప్పుబట్టింది. దిప్కేతో పాటు పలువురు నిరసన కారులు అనుమతి లేకుండా ప్రభుత్వ పాఠశాలలోకి ప్రవేశించారని స్కూల్ యాజమాన్యం ఆరోపించింది. విద్యార్థుల మధ్యలో కూర్చుని వారు ఇబ్బంది పడేలా ప్రశ్నలు వేశారని ఈ మేరకు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అలాగే తరగతులకు అంతరాయం కలిగించారని.. మరో స్కూల్ విద్యార్థుల్ని తీసుకొచ్చి ఈ స్కూల్ లో కూర్చోబెట్టారని కూడా ఆరోపణలు చేశారని ఫిర్యాదులో స్కూల్ యాజమాన్యం స్పష్టం చేసింది. అంతేకాక ఉపాధ్యాయుల్ని సస్పెండ్ చేస్తానని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 132, 329(3), 351(2), 356(2) కింద కేసు నమోదు చేశారు.
ఇక ఇటీవలి కాలంలో కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా క్రియాశీలకంగా మారుతున్న సంగతి తెలిసిందే. నీట్ పేపర్ లీక్ కు నిరసనగా ఇటీవల దేశరాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ భారీ నిరసనలు, ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. దాదాపు నెల రోజులకుపైగా ఈ ఆందోళలను జరిగాయి.

విద్యార్థులు వేలాదిగా ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వాళ్లు డిమాండ్ చేశారు. ఎట్టకేలకు ఛలో పార్లమెంట్ మార్చ్ తో కేంద్రం దిగివచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ను తొలగించి ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషీని నియమించింది. దాంతో సీజేపీ నిరసనలను విరమించింది.












Click it and Unblock the Notifications