Anna Canteens: అక్కడ అన్నా క్యాంటీన్ల ప్రారంభం ఆలస్యం ? కారణమిదే..!
ఏపీలో టీడీపీ బ్రాండ్ అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ కోసం ప్రయత్నాలు శరవేగంగా సాగుతున్నాయి. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ఠ్రంలో తొలి విడతగా 100 అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ కోసం ఎన్డీయే సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో రెండో దశలో ప్రారంభం కానున్నాయి. అదే సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా విశాఖ జిల్లాలో మాత్రం ఈ క్యాంటీన్ల పునరుద్దరణ వాయిదా పడుతోంది.
రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో అన్న క్యాంటీన్ల పునరుద్దరణకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ ఉమ్మడి విశాఖ జిల్లాలో మాత్రం అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఆటంకంగా మారింది. విశాఖ స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదలయ్యాయి. ఈ నెల 13వరకు నామినేషన్ల స్వీకరణ చేయనున్నారు. ఈనెల 30న పోలింగ్, సెప్టెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. దీంతో అప్పటివరకూ ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది. కాబట్టి అన్నా క్యాంటీన్ల పునరుద్దరణ ఇక్కడ సాధ్యం కావడం లేదు.

జీవీఎంసీ పరిధిలోనే పునరుద్దరించాల్సిన అన్నా క్యాంటీన్లు 24 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఈ క్యాంటీన్లను గత వైసీపీ ప్రభుత్వం మూసేసింది. ఈ నేపథ్యంలో వీటిని పునరుద్ధరించడంతో పాటు కొత్తగా ప్రారంభించాల్సిన క్యాంటీన్లపై మున్సిపల్ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యం కానున్నప్పటికీ ఆ తర్వాత రెండో దశలో మాత్రం వీటిని కచ్చితంగా ప్రారంభించనున్నారు.












Click it and Unblock the Notifications